అల్లదివో జలవాసము..సాకారానికి చేరువలో కాళేశ్వర జల సంకల్పం…

-సాకారానికి చేరువలో కాళేశ్వర జల సంకల్పం..
-తుదిమెరుగుల్లో తెలంగాణ వరప్రదాయిని మోటర్ల బిగింపులో పెరిగిన వేగం..
-రెండుచోట్ల నీటి లిఫ్టింగ్‌కు ఏర్పాట్లు
-మండువేసవిలోనూ మేడిగడ్డ వద్ద గోదారమ్మ కళకళ..
-వానకాలం నుంచి చెరువులకు కాళేశ్వరం నీళ్లు
-వాహనాల రాకపోకలకు అన్నారం, సుందిల్ల సిద్ధం..
-వచ్చే నెల అందుబాటులోకి రానున్న మేడిగడ్డ బరాజ్‌

సాగునీటి ప్రాజెక్టుల్లోనే ఓ అద్భుతం ఆవిష్కారం కానుంది. లక్షలమంది కార్మికుల శ్రమ, వేలమంది ఇంజినీర్ల ప్రతిభ ఫలితాలనివ్వబోతున్నది. తెలంగాణ వ్యవసాయం దశ దిశను మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధరించిన జల సంకల్పం.. అతిత్వరలో సిద్ధించబోతున్నది. పల్లమెరిగే నీరు ఏటికి ఎదురీది చెరువులను నింపేందుకు, తెలంగాణ మాగాణాలను ఫలవంతం చేసేందుకు పరుగులుతీసే అపురూప ఘడియలు.. మరికొద్ది రోజుల్లోనే సాక్షాత్కరించనున్నాయి. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు.. కొత్తగా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయుకట్టుకు సాగునీరు అందించే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం జల ఆవాసం.. వేగంగా సిద్ధమవుతున్నది. ప్రధాన నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద నిర్మిస్తున్న బరాజ్‌లు తుదిరూపు సంతరించుకుంటుండగా.. గోదారమ్మను ఎత్తిపోయడంలో కీలకమైన మోటర్ల బిగింపు పనులు సైతం వేగంగా పూర్తవుతున్నాయి. వెరసి.. ఈ వానకాలం నుంచే నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఈ వానకాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ గడ్డ మీద ఉన్న చెరువులను నింపాలన్న ప్రభుత్వ జలసంకల్పం మేరకు పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధానంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న మూడు బరాజ్‌లు తుదిరూపు సంతరించుకుంటుండగా.. గోదారమ్మ ను ఎత్తిపోసి, బీడు భూములను పండించడం లో కీలకమైన మోటర్ల బిగింపు పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల మోటర్ల వెట్న్‌ (నీటిని ఎత్తిపోసే పరీక్ష)కు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం బరాజ్‌ ఫోర్‌షోర్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు నిర్మిస్తు న్న కన్నెపల్లి పంపుహౌస్‌తోపాటు ఎల్లంపల్లి తర్వాత జలాలను మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు చేపట్టిన మేడారం పంపుహౌస్‌లోనూ వెట్న్‌క్రు అధికారులు రంగం సిద్ధంచేశారు.

తద్వారా వానకాలంలో నిరవధికంగా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సాంకేతికంగా సిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు మార్గంలో సవాల్‌గా మారిన జంట సొరంగాలు కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కేవలం కిలోమీటర్‌లోపు లైనింగ్‌ పనులు పూర్తయితే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. గోదావరిని ఒడిసిపట్టే బరాజ్‌లు మరోవైపు పౌరరవాణాకు కూడా వారధులుగా మారనుండటం పరిసర గ్రామాల ప్రజలకు వరంగా మారనున్నది. బరాజ్‌లపై బీటీ రోడ్ల నిర్మాణం తో ఇప్పటికే వాహనాల రాకపోకలకు అన్నా రం, సుందిల్ల బరాజ్‌లు అందుబాటులోకి రాగా.. మేడారం బరాజ్‌ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నదని అధికారులు చెప్తున్నారు. వీటిపై రాకపోకలకు అనుమతి ఇస్తే లక్షలమంది వాహనదారులకు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.

చివరిదశలో మేడిగడ్డ బరాజ్‌ పనులు
కాళేశ్వరంలో భాగంగా నిర్మిస్తున్న మూడు బరాజ్‌ల పనులు చివరిదశలో ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య గోదావరిపై 1628 మీటర్ల పొడవున నిర్మిస్తున్న మేడిగడ్డ బరాజ్‌ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. ఇక్కడ 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. మొత్తం 85 గేట్లు అమర్చాల్సి ఉండగా ప్రస్తుతం 67 గేట్ల పనులు పురోగతిలో ఉన్నా యి. ఇందులో 52 గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. రెండురోజుల్లో మిగిలిన గేట్ల పనులను మొదలుపెట్టనున్నారు. బరాజ్‌ నిర్మాణానికి మొత్తం 18.40 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిచేపట్టాల్సి ఉండగా 33వేల క్యూబిక్‌ మీటర్ల మేర పని మాత్ర మే మిగిలి ఉన్నది. అందులోనూ ప్రధాన బరాజ్‌కు సం బంధించి ఏడు వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే చేయాల్సి ఉన్నది.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పని పూర్తవడం విశేషం. బరాజ్‌లో భాగంగా 85 స్పాన్స్‌ (పిల్లర్‌-పిల్లర్‌ మధ్య ఉండే ప్రదేశం)కుగాను 69 స్పాన్స్‌పై గడ్డర్ల (స్లాబ్‌) ఏర్పాటు పూర్తయింది. ఈ నెల చివరికి మిగిలిన పనులుకూడా పూర్తికానున్నాయి. బరాజ్‌కు రెండు వైపులా సుమా రు 18.50 కిలోమీటర్ల బండ్‌ నిర్మించాల్సి ఉండగా.. ఐదారు కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తికావాల్సి ఉన్నది. బరాజ్‌ నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు రవాణామార్గం సుగమం అవుతుంది. రాకపోకలకుగాను వచ్చే నెల ఈ బరాజ్‌ అం దుబాటులోకి రానున్నదని సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పౌర రవాణాను మాత్రం ప్రభు త్వం అనుమతించాకే ప్రారంభిస్తామన్నారు.

ఆ.. 845 మీటర్ల లైనింగ్‌ పూర్తయితే!
కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరిపై నిర్మిస్తున్న బరాజ్‌, పంపుహౌజ్‌లు ఎంత కీలకమో.. ఎల్లంపల్లి రిజర్వాయర్‌ తర్వాత గోదావరి జలాలను మిడ్‌ మానేరుకు తరలించేందుకు చేపడుతున్న పనులు కూడా అంతేకీలకం. ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా తరలించిన తర్వాత ప్యాకేజీ-6లో భాగంగా నిర్మిస్తున్న మేడారం పంపుహౌస్‌లోని మోటర్ల ద్వారా నీటిని సుమారు 115 మీటర్ల మేర ఎత్తి మేడారం రిజర్వాయర్‌లో పోయనున్నారు. ఇందుకుగాను అక్కడ 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు మోటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ఆపై గోదావరి జలాలు ప్యాకేజీ-7లో భాగంగా నిర్మిస్తున్న జంట సొరంగాలద్వారా ముందుకు పోవాల్సి ఉన్నది. ఈ సొరంగాల నిర్మాణంలోనే నీటిపారుదలశాఖ అనేక సవాళ్లను ఎదుర్కొన్నది.
కొన్నిచోట్ల రాక్‌కాకుండా కేవలం మట్టి పొరలే రావటంతో కుప్పకూలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి నిపుణులను కూడా ఇక్కడి రప్పించి, అత్యంత జాగ్రత్తగా సవాళ్లను అధిగమించేందుకు చాలా సమయం పట్టింది. మొత్తంగా జంట సొరంగాల నిర్మాణం పూర్తికాగా లైనింగ్‌ పనులు చివరిదశలో ఉన్నాయి. ఒక్కో సొరంగం 11.24 కిలోమీటర్ల పొడవు ఉండగా.. రెండువైపులా కలిపి కేవలం 845 మీటర్ల మేర లైనింగ్‌ మాత్రమే మిగిలి ఉన్నది. మరో నెల వ్యవధిలో ఈ పనులను పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిందంటే.. మేడారం రిజర్వాయర్‌ నుంచి జలాలు రామడుగు పంపుహౌస్‌ (ప్యాకేజీ-8) వరకు వస్తాయి. అక్కడ ఉన్న మోటర్లతో నీటిని ఎత్తిపోస్తే.. ఎస్సారెస్పీ వరదకాల్వ.. తద్వారా మిడ్‌ మానేరుకు గోదారమ్మ పరుగుతీస్తుంది. అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జలాల తరలింపునకు మార్గం సుగమం అవుతుంది.

వేగంగా పూర్తవుతున్న పంప్‌హౌస్‌ పనులు
గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు మూడు బరాజ్‌ల ఫోర్‌షోర్‌ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌ల పనులు కీలకదశకు చేరుకున్నాయి. సివిల్‌ పనులు పూర్తికాగా పంపులు/మోట ర్ల బిగింపు పనులు చురుకుగా సాగుతున్నా యి. సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తవడం, పంపుహౌస్‌ల్లోనూ ఇప్పటివరకు పూర్తయిన పను ల దరిమిలా కన్నెపల్లి పంపుహౌస్‌లో వెట్న్‌క్రు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ రెండు టీఎంసీలను ఎత్తిపోసేందుకుపంపు లు/మోటర్లను సిద్ధంచేస్తుండగా.. అదనంగా మరో టీఎంసీని ఎత్తిపోసేందుకు వీలుగా అమర్చనున్న పంపులు/మోటర్లకోసం సివిల్‌పనులు కూడా పూర్తిచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో నిల్వ ఉన్న నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 మోటర్లను ఏర్పాటుచేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఏడు మోటర్లు సిద్ధమయ్యాయి. మరో రెండింటి బిగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. నెలాఖరునాటికి ఒకటి, వచ్చే నెల లో మరొకటి అందుబాటులోకి రానున్నా యి. మిగిలిన రెండు మోటర్లను వచ్చే నెలాఖరుకల్లా ఏర్పాటుచేయనున్నారు. అన్నారం పంపుహౌస్‌ వద్ద సివిల్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 1.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికిగాను దాదాపు 1.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని, 6.84 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనికిగాను 6.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. ఇక్కడ ఎనిమిది మోటర్లను బిగించాల్సి ఉండగా.. ఆరింటిని బిగించారు. మరో రెండింటిని బిగిస్తున్నారు. సుందిల్ల పంపుహౌస్‌ వద్ద సివిల్‌ పనులు చివరిదశలో ఉన్నాయి. ఇక్కడ తొమ్మిది మోటర్లను బిగించాల్సి ఉండగా.. నాల్గింటిని బిగించారు. మూడు మోటర్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి.
నిర్మాణం పూర్తయిన అన్నారం
అన్నారం బరాజ్‌ ఇప్పటికే పూర్తవడంతోపాటు బరాజ్‌పై బీటీ రోడ్డు నిర్మాణ పను లు కూడా చివరి దశకొచ్చాయి. 1270 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బరాజ్‌కు 66 గేట్లకుగాను అన్నింటినీ బిగించారు. బరాజ్‌ చివర్ల నిర్మించాల్సిన గైడ్‌, ఫ్లడ్‌ బ్యాంకుల నిర్మాణపనులూ పూర్తయ్యా యి. ఈ బరాజ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ఈ బరాజ్‌ నిర్మాణం వల్ల మహదేవ్‌పూర్‌ – చెన్నూరు ప్రాంతా ల మధ్య రాకపోకలకు మార్గం సుగమం కానున్నది. ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం కూడా చివరి దశకొచ్చినందున అనధికారికంగా కొన్ని వాహనాలు వెళ్తున్నాయి.
తుదిదశలో సుందిల్ల బరాజ్‌
తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సుందిల్ల బరాజ్‌ నిర్మాణం పూర్తయిం ది. 10.55 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనికిగాను కేవలం 119 క్యూబిక్‌మీటర్ల పని మాత్రమే మిగిలి ఉన్నది. మొత్తం 74 గేట్ల బిగింపు పూర్తయింది. బరాజ్‌పై బీటీ రోడ్డు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నా యి. 22 కిలోమీటర్ల గైడ్‌ బండ్లకుగాను కిలోమీటర్‌ మేర పనులు మిగిలాయి. రెవిట్‌మెంట్‌ పనులు కూడా చివరిదశకొచ్చా యి. సుందిల్ల బరాజ్‌ నిర్మాణం వల్ల చెన్నూరు- మంథని ప్రాంతాల మధ్య రాకపోకలకు మార్గం ఏర్పడుతుంది. వచ్చే నెల రాకపోకలకు అనువుగా మారనున్నది.
మేడిగడ్డ బరాజ్‌
నీటి నిల్వసామర్థ్యం: 16.17 టీఎంసీ
మొత్తం గేట్లు : 85
పూర్తయినవి/పురోగతిలో: 67
అన్నారం బరాజ్‌
నీటి నిల్వసామర్థ్యం: 11 టీఎంసీ
మొత్తం గేట్లు : 66
అన్నీ బిగించారు
సుందిల్ల బరాజ్‌
నీటి నిల్వసామర్థ్యం: 9 టీఎంసీ
మొత్తం గేట్లు : 74
అన్నీ బిగించారు
కన్నెపల్లి పంపుహౌజ్‌
మోటర్లు: 11
ఇప్పటివరకు సిద్ధమైనవి : 7
పురోగతిలోఉన్నవి: 2
అన్నారం పంపుహౌజ్‌
మోటర్లు: 8
ఇప్పటివరకు సిద్ధమైనవి : 6
పురోగతిలోఉన్నవి: 2
సుందిల్ల పంపుహౌజ్‌
మోటర్లు: 9
ఇప్పటివరకు సిద్ధమైనవి : 4
పురోగతిలోఉన్నవి: 3

About The Author