భాగవతం – 8 వ భాగం

పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?

ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు . . . ✍

About The Author