సి-విజిల్ ఎన్నికలలో అక్రమ ప్రచార సరళివంటి వాటిని అరికట్టడానికి …

సి-విజిల్ ఎన్నికలలో అక్రమ ప్రచార సరళివంటి వాటిని అరికట్టడానికి …

 

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో నియమావళి ఉల్లంఘన, అక్రమ ప్రచార సరళివంటి వాటిని అరికట్టడానికి మొదటిసారిగా ప్రవేశపెడుతున్న సి-విజిల్ అనే మొబైల్ యాప్ కు క్రమేణా ప్రజాదరణ ఎక్కువవుతున్నదనడానికి దీనికి అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పెరగడమే సాక్ష్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా. రజత్ కుమార్ వ్యాఖ్యానించారు. మొత్తం 31 జిల్లాలో ఇప్పటి వరకు మునుపెన్నడూ లేనంతగా 2520 ఫిర్యాదులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయి దర్యాప్తులో 1483 ఫిర్యాదులు పరిశీలనార్హమైనవిగా తేల్చిన రిటర్నింగ్ అధికారులు మిగిలిన వాటిని పక్కనబెట్టారు. జిల్లా కమాండ్ కంట్రోల్(డిసిసి) 492 ఫిర్యాదులను తిరస్కరించగా, 73 ఫిర్యాదులు నిర్ణయాత్మక దశలోనూ, మరో 12 పరిశీలన దశలోనూ పెండింగ్‌లో ఉన్నాయి.పరిశీలనార్హమైనవాటిలో 173 ఫిర్యాదులతో పెద్దపల్లి జిల్లా ప్రథమస్థానంలో ఉండగా, 166 ఫిర్యాదులతో మేడ్చల్-మల్కాజ్‌గిరి, 162తో జగిత్యాల్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుతో వరంగల్(గ్రామీణ) జిల్లా అట్టడుగుస్థాయిలో ఉంది.ఫిర్యాదు అందినప్పటినుంచీ దానిమీద సంబంధిత అధికారులు తగు చర్య తీసుకుని ఫిర్యాదు దారుకు ఆ సమాచారం అందివ్వడానికి మొత్తం 100 నిమిషాలు పడుతున్నదని ఎన్నికల సంఘం పరిశీలనలో తేలింది. ఏవయినా అక్రమాలు తమ దృష్టికి వచ్చినప్పుడు పౌరులు స్పందించి వెంటనే వారి స్మార్ట్ ఫోన్‌లలో ఫొటోలు లేదా వీడియోల రూపంలో బంధించి అప్ లోడ్ చేయడానికి 10 నిమిషాలు పడుతుండగా, డిసిసి నుంచి ఈ సమాచారం అందుకున్న క్షేత్రస్థాయి అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడానికి 15 నిమిషాలు, తగిన చర్య తీసుకుని నివేదిక సమర్పించడానికి మరో 30 నిమిషాలు పడుతన్నది. మొత్తం ఫిర్యాదును క్షణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల సమాచారాన్ని ఫిర్యాదుదారుకు అందించడానికి 50 నిమిషాలు పడుతున్నది.ఇంత త్వరగా స్పందించి, చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న సి-విజిల్ ఎన్నికల నిర్వహణలో ఉన్న సిబ్బంది, పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనావళి పట్ల అప్రమత్తంగా ఉండేటట్లు చేయడానికి బాగా ఉపయోగపడుతున్నదని డా. రజత్ కుమార్ వివరించారు.

About The Author