రైతు రుణ మాఫీ పై మాట మార్చిన చంద్రబాబు
పోలింగ్ ముందు వరకు ఇదిగో రుణ మాఫీ చివరి రెండు కిస్తులూ ఇచ్చేస్తున్నామని, నాల్గవ విడతకు నిధులిచ్చేశాం బ్యాంకులకెళ్లి సొమ్ము తీసుకోండని ఆశ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరా ఎన్నికలు ముగిశాక ఎన్నికల సంఘం పరిధిలోకి ఆర్థిక శాఖ సహా మొత్తం పాలనంతా వెళ్లినందున నిధులు విడుదల చేయట్లేదని చేతులెత్తేస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్న నాల్గవ విడత పరిస్థితే ఇలా ఉంటే ఎలాంటి కేటాయింపులూ లేని ఐదవ విడత వ్యవహారం గందరగోళంగా తయారైంది.
అధికారంలోకి తిరిగి టిడిపి వచ్చినా లేక వైసిపి గద్దెనెక్కినా రైతు రుణ మాఫీ విషయం అంతే సంగతులని, అన్నదాతలకు ఎగనామం పెట్టడం ఖాయమని స్పష్టం అవుతున్నది. ఐదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు అధికారం చేపట్టగానే తొలి సంతకం చేసిన ఫైల్ రైతు రుణమాఫీ కావడం గమనార్హం. ఐతే ఐదేళ్లవుతున్నా ఆ సంతకం కార్యరూపం దాల్చలేక పోతున్నది. ఐదు విడతల్లో ఏడాదికి 20 శాతం చొప్పున రూ.లక్షన్నర లోపు అప్పులను పది శాతం వడ్డీ వేసి మరీ మాఫీ చేస్తామన్నారు. అనేక వడపోతల అనంతరం రూ.24,500 కోట్లు మాఫీ చేస్తామని తేల్చారు.
ఐదేళ్లవుతున్నా మూడు విడతల సొమ్మునే, అదీ అన్నదాతలను అష్టకష్టాలూ పెట్టి అనేక దశల్లో అకౌంట్లల్లో వేశారు. ఇంకా నాల్గవ విడత రూ.4 వేల కోట్లు, ఐదవ విడత రూ.4 వేల కోట్లు వెరసి దాదాపు రూ.8 వేల కోట్లను 36 లక్షల మంది రైతులకు ప్రభుత్వం బకాయి పడింది. కాగా 2018-19 బడ్జెట్‌లో నాల్గవ విడత కోసం రూ.4,100 కోట్లు ప్రతిపాదించింది. నిధుల లభ్యత లేదంటూ చెల్లింపులను ఎన్నికల వరకు వాయిదా వేస్తూ వచ్చింది.
ఎన్నికల్లో ఎక్కడ రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో నాలుగు, ఐదు రెండు వితల సొమ్మును ఒకేసారి చెల్లిస్తామంది. బడ్జెట్‌లో ఒక విడతకే కేటాయింపులు చేసి రెండు విడతలకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తే ఏవొక నిధులు సర్దుబాటు చేస్తామని పోలింగ్ వరకు నాన్చింది.
ఇదిలా ఉండగా రైతు సాధికార సంస్థను మధ్యలో పెట్టి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి గండం గట్టెక్కాలనుకోగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఒకటి రూ.వెయ్యి కోట్లు, మరొక సంస్థ రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా సకాలంలో ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వ గ్యారంటీ లభించలేదు. దీంతో ఏం చేయాలో తెలీక పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు నాల్గవ విడత మట్టుకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
పోలింగ్ ముగిశాక కూడా ప్రచారం చేసిన విధంగా రైతు సాధికార సంస్థకు నిధులు అందలేదు. రూ.4 వేల కోట్లకు గాను క్లెయిములు రూ.3,200 కోట్లు పెట్టగా రూ.500 కోట్లకు మాత్రమే మంజూరు లభించింది.రోజువారీ ఖర్చులు, ఉద్యోగుల జీత భత్యాలు, నడుస్తున్న అత్యవసర ప్రజా సంక్షేమ పథకాలకే నిధుల లభ్యత అరకొరగా ఉండటంతో రుణ మాఫీ వంటి వాటిని అంత ప్రాధాన్యత లేనిదిగా భావించి నిధులు విడుదల చేయట్లేదు.