పబ్జీ గేమ్ వద్దన్నాడని భర్తకు విడాకులు…
కుటుంబ కలహాల వల్ల విడిపోయేవాళ్లను చూశాం, అభిరుచులు కలవక విడాకులు తీసుకున్న దంపతుల గాథలను వినే ఉంటాం. కానీ..ఈ జంట కథ మాత్రం చాలా విచిత్రం.
యూఏఈకి చెందిన పోలీసు అధికారి వాఫా ఖలీల్ చెప్పిన వివరాల ప్రకారం.. యూఏఈలోని ఆజ్మన్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. తనకు కొత్తగా పెళ్లయిందని తన ఇష్టాయిష్టాలకు తన భర్త అడ్డొస్తున్నాడని ఆమె కోర్టు ముందు చెప్పింది. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటూ కోర్టు ప్రశ్నించగా..తాను పబ్జీ ఆడుతుంటే మధ్యలో వచ్చి జోక్యం చేసుకుంటున్నాడని, ఆ ఆటను ఆడొద్దని పదే పదే హెచ్చరిస్తున్నాడని ఆమె వివరణ ఇచ్చింది. ఆమె సమాధానం విన్న కోర్టులో ఉన్న అందరూ విస్తుపోయారు. ఇందుకు ఆమె భర్తను వివరణ కోరగా..పబ్జీ ఆటకు బానిసైపోతుందేమోనన్న భయంతోనే ఆమె ఆ గేమ్ ఆడొద్దని చెప్పానని అన్నాడు. ఆ ఆటకు బానిసైతే తన ఉద్యోగం, ఇంటి బాధ్యతలపై ఆ ప్రభావం పడుతుందనే ఆమెను వారించినట్లు చెప్పాడు. అలా చేయడం స్వేచ్ఛను హరించినట్లు కాదని, కుటుంబంతో సఖ్యతగా కలిసి ఉండాలనే అలా చెప్పానన్నాడు. ఆమె విడాకులు కోరినప్పటికీ ఇచ్చే ఉద్దేశం తనకు లేనట్టు ఆమె భర్త చెప్పడం కొసమెరుపు.