శ్రీసత్యదేవ వైభవం…

శ్రీసత్యదేవ వైభవం – :

తన భక్తుల సేవాతత్పరతకు ముగ్ధుడై, వారి పేర్లను తన దివ్యనామానికి ముందు నిలుపుకొన్న భక్తవత్సలుడు- అన్నవరం సత్యదేవుడు! ఈరంకి ప్రకాశరావు, రాజా ఇనుగంటి వేంకట రామారాయణిం అనే భక్తుల పేర్లు ముందు చేరి, ఆయన వీరవేంకట సత్యనారాయణ స్వామి అయ్యాడని స్థలపురాణం చెబుతోంది. ఆ ఇద్దరు ధన్యజీవులకు స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి, తాను పంపానదీ తీరాన రత్నగిరిపై వెలశానని చెప్పారట. తక్కిన గ్రామస్థులతో కలిసి వారిద్దరూ రత్నగిరిపై అన్వేషించారు. స్థానికులు ‘దేవుడి చెట్టు’గా పిలిచే అంకుడు చెట్టు మొదలులో స్వామి అర్చామూర్తి లభించింది. ఆయన స్వయం వ్యక్తుడు. అంటే వారు వెతికితే స్వామి దొరకడం కాదు, స్వామి కనపడాలనుకొన్నప్పుడు వారు అన్వేషించేలా చేశాడు. హరిహర హిరణ్యగర్భ అర్చావతార మూర్తిగా 1891 శ్రావణశుద్ధ విదియనాడు తాను ఆవిర్భవిస్తానని స్వామి స్పప్నంలో చెప్పిన తీరుగానే జరిగింది.
ఆలయ నిర్మాణానికి పూనుకొన్నప్పుడు ‘మహానారాయణ మంత్రం’ వారికి లభించడం మరో ముఖ్యవిశేషం. ఆరు దళాలతో ఇరవైనాలుగు వృత్తాలు, 78 బీజాక్షర సంపుటితో కూడిన మహా మహిమాన్విత యంత్రంగా దానికి ప్రసిద్ధి. అవి గాక దానిలోని మరెన్నో విశేష మంత్రాల గురించి త్రిపాద్విభూతి వైకుంఠ నారాయణ ఉపనిషత్తులోని ఏడో అధ్యాయం విపులంగా చర్చించింది.
శ్రీమన్నారాయణుడి దివ్యవిభూతి నాలుగుపాదాలుగా ఉంటుందని పెద్దల అభిప్రాయం. స్వామి తన బొజ్జలో నిలుపుకొనే ఒక భాగాన్ని ‘లీలావిభూతి’గా చెబుతారు. సమస్త లోకాలు అందులోనే ఉంటాయని పురాణాలు వివరించాయి. ఈ ‘ఏకపాద్విభూతి అశాశ్వతమైనది. అనిత్యమైనది. నిత్యం, శాశ్వతం అయిన తక్కిన మూడు భాగాలను ‘త్రిపాద్విభూతి’ అంటారు. అన్నవరంలో సత్యదేవుడు త్రిపాద్విభూతితో హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకుడై ఆవిర్భవించాడని స్థలపురాణాలు ప్రకటించాయి. దానికి సాక్ష్యంగా భక్తులకు తక్షణమే వరాలు ప్రసాదించే ‘క్షిప్రప్రసాది’గా స్వామికి గుర్తింపు దక్కింది. భక్తుల పాలిట కొంగుబంగారమై సత్యదేవుడు నిత్యం ఆరాధనలకు నోచుకొంటున్నాడు.
సత్యదేవుడి ఆలయం రథం ఆకారంలో రెండంతస్తులుగా నిర్మితమైంది. కింది దాన్ని యంత్రాలయం అంటారు. మహానారాయణ మంత్రంమీద స్తంభాకారంలో శివలింగం, పై భాగంలో వీర వేంకట సత్యనారాయణస్వామి కొలువు తీరారు. మూలభాగాన్ని హిరణ్య గర్భుడి (బ్రహ్మ) స్వరూపంగా భావిస్తారు. స్తంభాకారంలో ఉన్న మధ్యభాగం పరమశివుడి స్వరూపం. దానిపై అమ్మవారు అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి స్వామివారు భక్తులకు దర్శనం అనుగ్రహిస్తారు.
యంత్రాలయంలో నాలుగు మూలలా గణపతి, సూర్యుడు, బాలా త్రిపురసుందరి, ఈశ్వరుడు పరివేష్టితులై ఉంటారు. మధ్యలో త్రిమూర్త్యాత్మకుడైన స్వామి ప్రతిష్ఠితుడై ఉన్న కారణంగా ఇది విష్ణు పంచాయతన ప్రతిష్ఠగల ఆలయంగా ప్రసిద్ధికి ఎక్కింది. పంచాయతన విధానానికి ప్రతీకగా నిలిచింది కాబట్టి, మరో ప్రత్యేకత ఈ ఆలయానికి జతపడింది. పంచాయతన ఆగమశైలికి సరితూగేలా ఆలయంపై ప్రధాన విమానంకాక, నలువైపులా నాలుగు శిఖరాలతో అలరారుతూ, ఒకే దేవాలయం అయిదు విమానాలు కలిగిందన్న ప్రతిష్ఠను మూట కట్టుకొంది.
నిత్యకల్యాణ మూర్తిగా పేరొందిన అన్నవరం సత్యదేవుడికి ఏడాది పొడుగునా ఎన్నో వేడుకలు చోటుచేసుకుంటాయి. అర్చనలు, ఆరాధనలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఆకర్షణీయమైనది క్షీరాబ్ధిద్వాదశి నాటి నౌకా విహారం. పంపాతీరంలో తులసీ, ధాత్రీ ప్రత్యేక పూజలను నిర్వహించి నౌకా విహారానికి సమాయత్తమయ్యే అనంతలక్ష్మీ సత్యవతీ సమేత అన్నవరం సత్యనారాయణస్వామి భక్త సులభుడు, సత్యమైన దేవుడు!
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ

About The Author