తులసి మాత అమ్మవారు…

తులసి మాత – :

లౌకికంగా తులసి ఆరోగ్య ప్రదాయిని. ఆధ్యాత్మికంగా శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రియమైంది. కార్తిక శుద్ధ ద్వాదశి రోజు తులసికి, శ్రీకృష్ణుడితో వివాహం జరిపించడం ద్వాపరయుగం నుంచీ ఆచారంగా వస్తోందన్నది ఐతిహ్యం. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణికి తులసి పట్ల వల్లమాలిన ప్రేమ. గోపికా మానస చోరుడైన మాధవుడిని తులసిలో ఆవాహన చేసుకొని తానే తులసి మొక్కననుకొని రుక్మిణి పరవశించి పోయేదని పద్మపురాణం చెబుతోంది. అందుకే గోపాలుడికి సైతం తులసి అంటే ఎనలేని ఇష్టం. ఇందువల్లే తులసిని విష్ణుప్రియ అని సంబోధిస్తారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) వరకు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ నాలుగు నెలలు సన్యాసులు, యతీంద్రులు ఏదైనా ఒక పవిత్ర క్షేత్రంలో చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. ఆ తరవాత ద్వాదశి రోజు తులసి వివాహం జరుపుతారు.
సముద్ర మథనం సందర్భంగా జలధి నుంచి ఉద్భవించిన శ్రీలక్ష్మిని శ్రీహరి పెళ్లి చేసుకొన్నాడు. తరవాత ఉద్భవించిన తులసి సైతం శ్రీహరినే పెళ్లాడాలని భావించి ప్రార్థించింది. అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన లక్ష్మి ఆమెకు సహ సతి (సవతి)గా ఉండేందుకు నిరాకరించింది. అప్పుడు విష్ణువు చిన్నబుచ్చుకొన్న తులసిని గమనించి కాలక్రమంలో శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకొంటానని వాగ్దానం చేస్తాడు.

అప్పుడు ఆమె బృంద అనే పేరుతో విష్ణు నామాన్నే స్మరిస్తూ క్షేత్ర యాత్రలు చేస్తూ ఉంటుంది. జలంధరుడనే రాక్షసుడు బృందను రాక్షస వివాహం చేసుకొంటాడు. కాని ఆమె ఆ అసురుడికి లొంగక అసాధ్యవతిగా ఉండిపోతుంది. నారాయణ మంత్రం జపిస్తూ నన్ను తాకినప్పుడు మాత్రమే నీవల్ల నా కన్యత్వానికి భంగం కలుగుతుందని బృంద జలంధరుడికి చెబుతుంది. అసురుడిగా పుట్టి అసుర జాతికే శత్రువు అయిన నారాయణుణ్ని స్మరించలేనని జలంధరుడు అంటాడు. రాక్షస దుశ్చర్యలు చేస్తూనే ఉంటాడు. కాని జలంధరుడికి మరణం రాకుండా ఆమె కన్యత్వమే అసురుణ్ని కాపాడుతూ ఉంటుంది. రాక్షసుణ్ని సంహరించాలని శివకేశవులిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేసినా బృంద కన్యత్వం అతణ్ని రక్షిస్తూ ఉంటుంది. అప్పుడు విష్ణువు జలంధరుడి రూపం ధరించి నారాయణ మంత్రం జపిస్తూ బృంద కన్యత్వాన్ని దోచుకొంటాడు.

విష్ణువును పెళ్లాడాలనుకొన్న తాను సచ్ఛీలత కోల్పోయానని భ్రమించి ఆమె గండకీ నదిలో పడి ప్రాణత్యాగం చేస్తుంది. దీనితో జలంధరుడిలోని బలం హీనమై శివుడి త్రిశూలం వల్ల మరణిస్తాడు. విష్ణువు నిజం తెలిపేందుకు ఆమెను వెంబడించి తాను సైతం గండకీ నదిలోకి ప్రవేశించగానే శాలిగ్రామంగా మారిపోతాడు. బృంద సచ్ఛీలత, పాతివ్రత్యం కారణంగా పవిత్ర గండకీ నదిలో బృంద దూకగానే తులసి మొక్కగా మారిపోతుంది. అప్పుడు విరించి స్వయాన భూమిపైకి దిగి యాజ్ఞీకుడై శాలిగ్రామానికి అమలిక (ఉసిరి) రూపం కల్పించి ఆ రెండు మొక్కలకూ కార్తిక శుద్ధ ద్వాదశి రోజు వివాహం జరుపుతాడు. ఈ పవిత్ర దైవిక సంఘటన జ్ఞాపకార్థం అప్పట్నుంచీ ఇదే రోజు తులసి వివాహం జరపడం సంప్రదాయమైంది. తులసిని మాతగా, ఉసిరి మొక్కను దామోదరుడిగా పూజించడం ఆనవాయితీ.
వైష్ణవ ఆలయాల్లో తులసి మాలను శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి, విష్ణుమూర్తికి ధరింపజేస్తారు. బిహార్‌ రాష్ట్రంలో సౌంజ గ్రామంలోని ప్రభుధామంలో తులసి కల్యాణం ఘనంగా జరుపుతారు. ఈ కల్యాణోత్సవాలు అక్కడ మూడు రోజులు నిర్వహిస్తారు. తులసి కల్యాణం చూసిన కన్యకు ఏడాది లోపలే విష్ణువు లాంటి వరుడితో పెళ్లవుతుందని పలువురు నమ్ముతారు.

About The Author