రిషబ్ పంత్ షాట్ సెలక్షన్ మార్చుకో..!

 

భారత యువ హిట్టర్ రిషబ్ పంత్ తన షాట్ సెలక్షన్‌ను మార్చుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టుని దినేశ్ కార్తీక్‌తో కలిసి విజయతీరాలకి చేర్చిన రిషబ్ పంత్ ఆఖర్లో పేలవంగా ఔటవడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకవేళ రిషబ్ పంత్ ఔటవ్వకుండా ఉండింటే.. మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉండేవి.

వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. ఛేదనలో దినేశ్ కార్తీక్‌‌తో కలిసి రిషబ్ పంత్ (20: 15 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడటంతో భారత్ 15.2 ఓవర్లు ముగిసే సమయానికి 156/4తో నిలిచింది. దీంతో.. సమీకరణం 10 బంతుల్లో 18 పరుగులుగా మారిపోగా.. ఈ దశలో రిషబ్ పంత్ ఆఫ్ సైడ్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నంచి పేలవంగా బంతిని గాల్లోకి లేపేసి ఔటయ్యాడు. ఆ తర్వాత.. ఒత్తిడికి గురైన దినేశ్ కార్తీక్, కృనాల్‌ పాండ్య ఆఖరి ఓవర్‌లో చేతులెత్తేయడంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రిషబ్ పంత్ ఔట్.. మ్యాచ్‌లో కీలక మలుపని కెప్టెన్ కోహ్లీ కూడా అంగీకరించాడు.

రిషబ్ పంత్ ఆటతీరు గురించి తాజాగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘దినేశ్ కార్తీక్‌తో కలిసి రిషబ్ పంత్ మ్యాచ్‌ని గెలిపించి ఉండాల్సింది. అతను బ్యాటింగ్ చేసిన తీరు.. మ్యాచ్‌ని దాదాపు భారత్ చేతుల్లోకి తెచ్చేసింది. కానీ.. ఒకే ఒక్క పేలవ షాట్.. అతని ప్రదర్శనని తీసికట్టుగా మార్చింది. రిషబ్ పంత్ యువ క్రికెటర్ కాబట్టి.. అతనికి జట్టులో ఎవరైనా.. దిశానిర్దేశం చేయాలి. అలాంటి చెత్త షాట్లు ఆడకుండా.. స్ట్రైయిట్‌గా ఆడమని సూచించాలి. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ.. షాట్ సెలక్షన్‌ని కొద్దిగా మార్చుకోవాలి. అదేమంత కష్టం కూడా కాదు’ అని వెల్లడించాడు.

About The Author