భారతమ్మ జంతికలకు భలే గిరాకీ!

 


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఉందీ మొగిలి గ్రామం. సీజను కాకపోయినా కూడా ఇరవై, ముఫ్పై వాహనాలు క్యూలో నిలబడి ఎదురు చూడాల్సిందే భారతమ్మ వండే జంతికలు రుచిచూడటం కోసం.

అటు బెంగళూరు వెళ్లేవాళ్లూ, ఇటు చెన్నై వెళ్లే వాళ్లు కూడా ఆమె చేసిన జంతికలు కొని బంధువుల ఇళ్లకు కానుకగా పట్టుకెళ్తారు. ఆమె చేసిన జంతికల రుచి సరిహద్దులు దాటి అమెరికా, కువైట్‌, సౌదీ అరేబియా, లండన్‌ వంటి విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకూ పరిచయం అయ్యింది.

అరవైఐదేళ్ల భారతమ్మ ఈ పనిని గత ముప్ఫైఐదేళ్లుగా చేస్తోంది. ఈ ముప్ఫైఐదేళ్లలో ఆమె తన కుటుంబాన్ని పైకి తీసుకురావడమే కాదు…తనలాంటి మరో పది కుటుంబాలకు ఆసరాగా నిలిచింది.

భారతమ్మకు ఐదుగురు పిల్లలు. అందులో ఒక కొడుకుకి మానసిక వైకల్యం ఉంది. వీళ్లందరినీ పోషించడానికి భర్త రాజన్నతో కలిసి ఓ కల్యాణమండపంలో పనిచేసేది.

కష్టపడి పనిచేసే ఆ దంపతులని చూసి మండపం యజమాని రూ.130 చేతిలో పెట్టి సొంతంగా టీకొట్టు పెట్టుకోండంటూ సలహా ఇచ్చాడు.

రాజన్న టీకొట్టు నడుపుతుంటే భారతమ్మ తనకొచ్చిన జంతికల తయారీ మొదలుపెట్టింది. ఒక్కోటి అర్ద ´రూపాయి. క్రమంగా టీ కంటే ఈ మురుకులు కోసం వచ్చే వాళ్లే ఎక్కువయ్యారు.

భారతమ్మ జంతికలు చేయగా వచ్చిన డబ్బుతోనే ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. అక్కడితో కథ సుఖాంతం కాలేదు. తన ముగ్గురు ఆడపిల్లల్లో మంజుల అనే అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. మరో ఇద్దరాడపిల్లల వేర్వేరు కారణాలతో భర్తలని కోల్పోయారు. దాంతో వాళ్లకి పుట్టిల్లు తప్ప మరోదారి లేకపోయింది.

భారతమ్మ ఈ కష్టాలకి కుంగిపోలేదు. వాళ్లకి ధైర్యం నూరిపోసి అదే పని నేర్పింది. నాలుగేళ్ల క్రితం కొడుకుని కోల్పోయింది భారతమ్మ. అయినా ఆమె ధైర్యం చెక్కుచెదరలేదు.

ఎవరైనా తనతో కష్టం చెప్పుకుంటే వాళ్లకీ తనకొచ్చిన ఈ విద్యనే నేర్పేది. అలా ఒకరూ ఇద్దరికి కాదు పది మందికి పని ఇచ్చింది. ఆ కుటుంబాలకు మురుకులూ, పాకంపప్పు ఉండల తయారీలో మెలకువలు నేర్పించి, పనిచేయిస్తూ నెలకు ఆరువేలరూపాయల జీతంతో పాటూ భోజనం, వసతి కల్పించి నీడనిచ్చింది.

మొగిలి గ్రామంలో ఉండే మొగిలేశ్వరస్వామి ఆలయానికి ఎంతో మంది పర్యటకులు వస్తూంటారు. అక్కడికి వచ్చినవాళ్లందరూ ఈ జంతికలూ, పప్పు ఉండలు తప్పనిసరిగా కొనుక్కుని వెళ్తుంటారు.

ఇంత రుచి ఎలా సాధ్యమైంది అని అడిగితే వాటి తయారీ గురించి కూడా చెప్పేసింది. ‘సెనగపిండీ, వరిపిండీ, తెల్ల నువ్వులూ, వామూ, కారం, ఉప్పూ తగినంత వేసుకుంటే సరి. ఆ రుచి మీకైనా వస్తుంది’ అంటూ నవ్వుస్తుందామె.

మురుకులు ఒక్కోటి రూ.5, పాకంపప్పుండలు ఒక్కోటి రూ.10 ఉంటుంది. కాస్త ఖరీదు ఎక్కువైనా ఆ రుచికి ఆ ధర తక్కువే అంటారు తిన్నవాళ్లు.

ఇక్కడ నుంచి అమెరికాతోపాటూ లండన్‌, సౌదీ వెళ్లేవారు… ఈ జంతికలు చాలా ఇష్టంగా కొని పట్టుకుని వెళ్తూ ఉంటారు. ప్రవాస భారతీయులు అయితే ఫోన్‌ ద్వారా ఆర్డరు ఇచ్చి తెప్పించుకుంటారు. రోజుకి కనీసం పదివేల రూపాయల వరకూ వ్యాపారం సాగుతుంది.

భారతమ్మ కష్టం వృథా పోలేదు. ఆమె మనవలందరూ చక్కగా చదువుకున్నారు.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

About The Author