“మల్లేశం” సినిమా ప్రివ్యూ ను చుసిన శ్రీ కేటీఆర్…


తెలంగాణకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మల్లేశం” సినిమా ప్రివ్యూ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఈ రోజు చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెద్దగా చదువుకో కున్నా, తన తల్లి చేనేత వృత్తిలో పడుతున్న కష్టం తీర్చడానికి ఒక యువకుడు ఎంతో శ్రమించి ఒక యంత్రం తయారుచేసి, పద్మశ్రీ పురస్కారం పొందిన స్ఫూర్తిదాయకమైన కథను చాలా హృద్యంగా తెరకెక్కించారని చిత్ర బృందాన్ని అభినందించారు. చిత్రంలో సహజత్వం తనని ఆకట్టుకున్నదని, నటీనటుల అందరూ పాత్రల్లో జీవించారు అని కేటీఆర్ ప్రశంసించారు.

ఈ సినిమా ఇంకెంతో మంది రూరల్ ఇన్నోవేటర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. చేనేత, మర నేత కార్మికుల వెతలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఎన్నో చర్యలు తీసుకుందని, వారి అభ్యున్నతి కొరకు ఇంకా కూడా పాటుపడతామని కేటీఆర్ అన్నారు.

చిత్ర దర్శకులు రాజ్ ను అభినందించి, చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.