న్యూస్ చానెల్స్ నిగ నేత్రం లో….


రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా నియమావళి ఉల్లంఘనలతో ప్రసారమయ్యే వార్తలను, వాటిని ప్రసారం చేసే టీవీ ఛానళ్ల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన విభాగం గత అక్టోబరు 19 నుండి ఎన్నికల ఉల్లంఘనలను నమోదు చేస్తున్నదని ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ వెల్లడించారు. వీటిలో నగదు, మద్యం, గంజాయి, గుట్కా, బంగారు, వెండి ఆభరణాల పంపిణీ దగ్గర నుంచీ రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తలు, ప్రసంగాలవరకు ఉన్నాయని ఆయన వివరించారు. మొత్తం తెలుగులో 25, ఉర్దూలో 5, ఇంగ్లీషులో 2 వార్తా ఛానళ్ళను ఈ విభాగం రాత్రింబవళ్ళూ పరిశీలిస్తుంది. అభ్యర్థులపై, రాజకీయ పార్టీలపై, టీవీ ఛానళ్ళపై విడివిడిగా రూపొదించిన రోజువారీ నివేదికలను వీడియో క్లిప్పులతో సహా కలిపి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా ఎన్నికల అధికార్లకు పంపుతుంది. నియమాలను ఉల్లంఘించి ప్రసారం చేసిన ప్రకటనలు, చెల్లింపు వార్తల నివేదికలను ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) కి పంపుతుంది. ఎన్నికల ప్రధాన అధికారి గత అక్టోబరు 3న ఈ కమిటీని నియమించారు.ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవడానికి వారికి వాస్తవ సమాచారం అందడం అవసరం. అవి సరిగ అందేలా చూడడానికి, రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించే చర్యలలో భాగంగా ఎన్నికల కమీషన్ ఈ ఏర్పాటు చేసింది.

About The Author