రాష్ట్రంలో విద్యావిధానంలో నూతన ఒరవడికి శ్రీకారం…


రాష్ట్రంలో విద్యావిధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న ధ్యేయంతోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయంలో ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యావిధానాల్లో సంస్కరణలను తీసుకురావడానికి తన హయాంలో కమిటీ ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సమాజాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించడం జరిగిందన్నారు. అందులో భాగంగా తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసే దిశలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యాసంస్కరణలను చేయడానికి తగిన సిఫారసులు చేయాలని కోరడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కమిటీ తగిన సిఫారసులు చేయాలని, వాటి అమలుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల అమలులో పెద్దపీట వేస్తున్నామన్నారు. విద్య ద్వారా జీవనోపాధి మాత్రమే కాదని, జీవితం ఎలా కొనసాగించవచ్చో తెలిపే విధానం ముఖ్యమని మంత్రి వెల్లడించారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయల ఆర్థిక చేయూతనందిచడం ద్వారా బడి బయటి పిల్లలను తిరిగి బడికి పంపించే కార్యక్రమాన్ని చేపట్టగలిగామన్నారు. విద్యావిధానానికి ఒక నిర్ధిష్ఠమైన రూపు తీసుకురావడంతో పాటు సంప్రదాయ విద్యను కూడా సమాంతరంగా అందించే దిశలో సూచనలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రాథమిక శిక్షా అభియాన్ ద్వారా విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యా రంగంలో సమగ్ర శిక్షా అభియాన్ అమలు జరిగేలాగా కమిటీ తగిన సిఫారసులు చేయడం జరగాలని మంత్రి అభిలాషించారు. విద్యావిధానాల్లో సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ఐఐఎస్ సీ బెంగుళూరు ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణన్ అన్నారు. లక్ష్యాలు నిర్ధేశించుకుని గమ్యాన్ని చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో విద్యావిధానం లోటుపాట్ల వల్ల ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి పలువురు నిపుణులు ఏటా వెళ్ళి అక్కడ పని చేస్తున్నారన్నారు. 21వ శతాబ్ధంలో చదువులను అభిలాషించేలా ఉండాలని, అదే సందర్భంలో సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. #iprap

About The Author