మరణసమయంలో దేవున్ని స్మరిస్తే మోక్షం పొందుతారా ?
శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే
“అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః”
దీని అర్థము
“ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు ” అని సామాన్యముగా అనుకొంటారు.
కాని ఈ అర్థము కొంతవరకే సరైనది.
అసలు అర్థము “ఎవరైతే మరణ సమయములో “కూడా” నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు ”
అర్థము బాగా గమనించండి. ఇక్కడ “కూడా” అనే పదము చేరడము వలన వచ్చిన మార్పు. శ్లోకము లో “చ” అనే పదానికి “కూడా” అని అర్థము.
సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం “అమ్మా” అనో, “అబ్బా” అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.
మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?
మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో “కూడా” గుర్తుకువస్తాడు.
అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.
ఒక గుడి వద్ద మీరు దేవుడి దర్శనం కోసం వాకిలి వద్దే ఒక 10 గంటల నుండి వేచిఉన్నారనుకోండి. ఇప్పుడే తలుపు తీసారు. కాని అదే సమయములో ఒక వ్యక్తి హడావుడిగా పరుగెత్తుకుంటూ వచ్చి దైవదర్శనం చేసుకున్నాడనుకొందా. ఇక్కడ అంతసేపు వేచి ఉండిన మీకు,ఆ వ్యక్తికి దైవదర్శన విషయములో ఏదైనా తేడా ఉందా? ఇద్దరూ ఒక్కసారే దర్శనం చేసుకొన్నారు. పైపైన ఆలోచిస్తే ఇది అన్యాయం అనిపిస్తుంది.
కాని ఒక్క విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
అదేమిటంటే మీరు అంతసేపు వేచిఉన్నా దైవదర్శన విషయములో మీకు ఎలాంటి సందేహము లేదు. కాని ఆ హడావుడి వ్యక్తికి “దర్శనము అవుతుందో,లేదో?, తలుపులు వేసేస్తారో ఏమో?” లాంటి సందేహాలు ఉంటాయి.
మరియూ అంతసేపూ మీరు దేవున్ని గురించే ఆలోచించే అవకాశం చాలా ఉంది. ఆ హడావుడి వ్యక్తి కి అప్పుడే దేవుడు గుర్తుకురావడం వలనే అంత హడావుడిగా వచ్చాడు.
అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.