వేద వ్యాస మహర్షి జీవిత విశేషాలు…


మనమహర్షులు : వేద వ్యాస మహర్షి జీవిత విశేషాలు

వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.

జన్మ వృత్తాంతం:

వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్లు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు.

వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు.

ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.

అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
భారతంలో వ్యాసుని పాత్ర

మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.

>> వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.

>> సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.

>> ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. * దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు.

>> ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు.

>>ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

వ్యాస భగవానులు రచించిన గ్రంధములు :

అష్టాదశ పురాణాలు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణ వాఙ్మయం ఆవిర్భావంభాగవత పురాణము ఆధారంగా వరాహ అవతారము యొక్క ఒక ఉదాహరణ “పురాణ” శబ్దానికి “పూర్వ కాల కథా విశేషం” అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది.

శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది.

ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. “అ” నుండి “హ” వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి.

ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.
పురాణం లక్షణాలు

ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

సర్గము – సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది

ప్రతి సర్గము – సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)

వంశము – పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట

మన్వంతరము – ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట

వంశాలచరిత్ర

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల విభజన

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:

“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం

అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]

– బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.

– పద్మ పురాణము – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.

– విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.

– శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.

– లింగ పురాణము – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.

– గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.

– నారద పురాణము – నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.

– భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.

– అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.

– స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.

– భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.

– బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.

– మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.

– వామన పురాణము – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.

– వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.

– మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.

– కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.

– బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు – సాత్విక గుణాన్ని

బ్రహ్మ పురాణాలు – రాజస గుణాన్ని

శైవ పురాణాలు – తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం
వర్గీకరణ

మహాపురాణాలు : దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి.

త్రిమూర్తి: వైష్ణవ పురాణాలు: విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము
బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం,

శైవ పురాణాలు: శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

నరసింహ
శివధర్మ
దౌర్వాస
నారదీయ పురాణము
కాపిల
మానవ
ఔసనశ
బ్రహ్మాండ
వారున
కౌశిక
లైంగ
సాంబ
సౌర
పారాశర
మారీచ
భార్గవ
స్కాంద
సనత్కుమార

గురుపౌర్ణమి

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ (ఆంగ్లం: Guru Purnima) అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

About The Author