మీ పెరట్లోనే నిగనిగలాడే వంకాయలు…


కూరగాయలు ప్రధానంగా పండించే రైతులు వంగ పంటపై విపరీతంగా పురుగు మందులు చల్లుతున్నారు. మిద్దెతోటలు, పెరటితోటలు సాగు చేసేవారు కొంచెం శ్రద్ధ పెడితే వంగ పంటను పండించడం సులభం అంటున్నారు ప్రముఖ మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి.
మిద్దెతోటలు, పెరటితోటల్లో వంగ మొక్కలను పెంచడం సులభం. ఈ మొక్కల సుగుణం ఏమిటంటే ఏ కాలంలో అయినా కాపు కాస్తాయి. మూడు కాలాల్లో కూడా పండించవచ్చు. హైబ్రిడ్‌ విత్తనాలు అయితే ఆరు నెలల నుండి సంవత్సరం వరకు కాపు కాస్తాయి. దేశీ విత్తనాలు అయితే చీడపీడలు తక్కువ, జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి రెండు సంవత్సరాల పాటు కాపు కాస్తాయి. వంగకు నీరు తక్కువ అవసరం ఉంటుంది. వంగ ఎక్కువ కాపు కాసినప్పుడు నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు లేదా ముక్కలు కోసి ఎండబెట్టుకుని వరుగులు చేసుకుని తరువాత వాడుకోవచ్చు. వంగ మొక్కలను ప్రధానంగా రెండు రకాల చీడపీడలు ఇబ్బంది పెడతాయి. పేను సమస్య తీవ్రంగా ఉంటుంది. అలాగే కాయ తొలుచు పురుగు కూడా బాగా నష్టం కలిగిస్తుంది.

అప్పుడప్పుడు తెల్లనల్లి సమస్య కూడా వస్తుంది. బయట రైతులు వంగ పంట మీద విపరీతంగా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక ఎకరం వంగ పంట మీద దాదాపు పది లీటర్ల పురుగు మందులు చల్లుతున్నారు. ఈ పంట మీద చల్లినన్ని పురుగు మందులు ఏ ఇతర పంటల మీదా చల్లడం లేదు. అందువల్ల వంగ మొక్కల్ని మిద్దెతోటల్లో తప్పనిసరిగా మూడు కాలాల్లోనూ పండించుకోవాలి.
వంగ పంటలో ప్రధాన చీడపీడయిన పేను నివారణ గురించి తెలుసుకుందాం. వంగ మొక్కల ఆకుల అడుగుభాగాలలో పేను చేరుతుంది. కంటికి కనిపిస్తుంది. లేత ఆకుపచ్చ పసుపుఛాయలో ఉంటుంది. పేను చేరిన మొక్కల మీద ఎర్రచీమలు సంచరిస్తుంటాయి. పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంగా పారెయ్యాలి. పేనును మొదటి దశలోనే గుర్తిస్తే చేత్తో సున్నితంగా నలిపి కూడా నివారించవచ్చు. బాగా పేను సోకిన ఆకులను తెంపి పారేశాక వేపనూనె పిచికారీ చేయాలి. అయిదు లేదా పది మిల్లీలీటర్ల వేపనూనెను ఒక లీటరు నీటిలో బాగా కలిపి మొక్కలు బాగా తడిసేలాగా పిచికారీ చేయాలి. మళ్లీ వారం వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. వేపనూనెకు బదులు వంటింటి పదార్థాలైన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటి వాటి రసాలను కూడా పిచికారీ చేయవచ్చు. కొద్దిగా శ్రద్ధ పెడితే సంవత్సరం పొడవునా వంగ పంట పండించుకోవచ్చు.

About The Author