అత్తలూరులో కూరగాయల సిరులు…


55 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తికి సన్నాహాలు
ఆర్గానిక్‌ సాగుతో నాణ్యత… 3,500 మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు కూరగాయల కొరత లేకుండా చూసేందుకు అమరావతి సమీపంలో అత్తలూరిపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ పేరుతో భారీ కూరగాయల క్షేత్రం రూపుదిద్దుకుంది. రైతుల సారథ్యంలో 3,500 ఎకరాల్లో ఆధునిక పద్ధతులలో కూరగాయలు సాగవుతాయి.

ఆర్గానిక్‌ కూరగాయలకు కేరాఫ్‌గా మారనున్న
ఆ ప్రాజెక్ట్‌ విశేషాలు…!!!

అమరావతిలో రాజధాని ఏర్పడటంతో చుట్టుపక్కల జిల్లాల్లో కూరగాయలు, పండ్లు పండించే భూములు తగ్గాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేసేందుకు వీలుగా అమరావతి మండలం అత్తలూరులో 3,500 ఎకరాల్లో బిందు, తుంపర సేద్య విధానంలో కూరగాయలు పండే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ సూచన మేరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ప్రభుత్వ చేయూతతో ఈ ప్రాజెక్టునుఅమలుచేస్తున్నారు. అత్తలూరిపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థను రైతుల భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. ఏటా 10,500 ఎకరాల్లో 50 రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలను పండించబోతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండిస్తారు. 3,500 ఎకరాల కూరగాయల తోటలకు అవసరమైన సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి 250 ఆవులతో గోశాలను ఏర్పాటుచేశారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్‌ చిరంజీవి చౌదరి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆలపాటి సత్య నారాయణ ఆ గ్రామంలోని రైతులతో అనేక దశల్లో చర్చలు జరిపారు. గ్రామస్తులంతా కూరగాయలు పండించడానికి ముందుకు వచ్చారు.

అమరావతి మేజర్‌ కింద అత్తలూరు చివరి భూములుగా ఉన్నాయి. గ్రామంలో పత్తి, మిర్చి ఎక్కువగా పండించేవారు. దీనివల్ల భూములు, అందులో పండే పంటలు విషతుల్య మయ్యాయి. పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ అత్తలూరును కూరగాయలు పండించే క్షేత్రంగా ఎంపిక చేసింది. కృష్ణానది సమీపంలో ఎత్తిపోతల పథకం, భూగర్భ జలవనరులను ఉపయోగించి బోరు ద్వారా, అమరావతి మేజర్‌లో ఆరుతడి పంటలుగా కూరగాయలను సాగు చేయొచ్చని డాక్టర్‌ ఆలపాటి సిఫార్సు చేశారు. ఇక్కడ పండించిన కూరగాయలను స్థానిక అవసరాలకు ఉపయోగించుకోవడంతో పాటు గన్నవరం విమానాశ్రయం ద్వారా ఇతర ప్రాంతాలకు, మాదిపాడు నుంచి కృష్ణానది వద్ద బోట్లు, పడవల ద్వారా జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్‌కు రవాణా చేయొచ్చని సంకల్పించారు. అత్తలూరులో కూరగాయల సాగు లాభసాటిగా మారితే ఆ ప్రాంతంలోని ఇతర గ్రామాల్లో కూడా దీనిని అమలు చేయొచ్చని భావిస్తున్నారు. అత్తలూరిపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ఫ్రొడ్యూసర్స్‌ అనే సంస్థ ద్వారా 3,500 మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. కూరగాయలు పండించడం, మార్కెటింగ్‌లో ఉద్యోగాలిస్తారు. అక్కడ చేయాల్సిన పనికి అనుగుణంగా యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను అత్తలూరులో ఏర్పాటు చేశారు.

• మీ ఇంటికే కూరగాయలు

జిల్లాలో ఏ ప్రాంతానికి చెందినవారికైనా ఈ కేంద్రం నుంచి నేరుగా ఆర్గానిక్‌ కూరగాయలు ఇంటికి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తమ చిరునామాను ఈ సంస్థలో నమోదు చేసుకుంటే ఏ రకం కూరగాయలు కావాలో మేసేజ్‌ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే పంపుతారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్గానిక్‌ కూరగాయలు పండించే రైతుల నుంచి కార్పొరేట్‌ సంస్థలు వాటిని కొనుగోలు చేసి వారి సంచుల్లో మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. ఆర్గానిక్‌ కూరగాయలు పండించడానికి అవసరమైన ఆవు మూత్రం, ఆవు పేడ కోసం 250 ఆవులతో గోశాలను ఏర్పాటుచేశారు. పండిన కూరగాయలను నిల్వ చేయడానికి ప్యాక్‌ హౌస్‌, క్లీనింగ్‌, గ్రేడింగ్‌, పాకేజీ, కోల్డ్‌ స్టోరేజీని ఏర్పాటుచేస్తున్నారు. ఆర్గానిక్‌ కూరగాయల సాగులో భాగంగా అత్తలూరులో తొలిదశలో 500 ఎకరాల్లో కూరగాయల తోటలు వేస్తున్నారు. 3,500 ఎకరాల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల కూరగాయల సాగును ఇప్పటికే చేపట్టారు. ఈ సంస్థలో ఉద్యోగాలు, కూరగాయల కొనుగోలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలు కావాల్సిన వారు 08640-255935, 98481 32011, 98493 32705, 63052 12359కు ఫోన్‌ చేసి తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

• ఎకరానికి ఏడాదికి రూ. లక్ష ఆదాయం

కూరగాయల సాగువలన ఎకరానికి ఏడాదికి
రూ.లక్ష ఆదాయం పొందాలి. మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో మూడు పంటలు తీయాలి. అన్ని రకాల కూరగాయలను పండించాలి. ఎరువులు, పురుగు మందులు లేకుండా గోమూత్రం, ఆవు పేడ ద్వారా వివిధ రకాల ఎరువులను రైతులే తయారుచేసుకుని పండిస్తారు. విత్తనాలు కూడా ఇక్కడే పండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 50 రకాల కూరగాయలను పండించడానికి ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ, సీనియర్‌ శాస్త్రవేత్త

• కూరగాయల రైతులకు ప్రోత్సాహం

రాజధాని నిర్మాణం వలన పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. జనాభా పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని కూరగాయల సాగును పెంచాలని మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఎఫ్‌పివోల ద్వారా బిందు, తుంపర సేద్యాన్ని అనుసంధానం చేశాం. ఉద్యానవన, సుగంధ ద్రవ్యాల బోర్డుల ద్వారా రాయితీలు ఇస్తున్నాం. ప్రతి రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. లక్ష ఆదాయం వచ్చే విధంగా అంచనాలు రూపొందించాం.
– ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి

• వాణిజ్య పంటలతో విసిగి పోయాం…!

మా భూములు అమరావతి మేజర్‌లో టై లాండ్‌గా ఉన్నాయి. సాగర్‌ నీరు వస్తుందో లేదో తెలీదు. దీనితో పత్తి, మిర్చి సాగు చేస్తున్నాం. ఎంత ఖర్చుపెట్టినా ఆదాయం లేదు. ఉద్యానవన శాఖ వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రాయితీలు అందిస్తోంది. సుమారు 3,500 మంది యువతకు ఉపాధి కల్పించబోతున్నాం. విద్యార్హతలతో పని లేకుండా ఎవరొచ్చినా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తాం.

About The Author