ఆకుకూర… ఆనందం చూడరా!
ఆకు కూర… కట్ట రూ.5
ఆ కట్టలే కోట్లు పండిస్తున్నాయి…
ఆ ఆకులే సంపదను సృష్టిస్తున్నాయి…
ఏంటా కథ… ఆ ఊరు వెళదాం పదండి…!!!
ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం మిన్నెకల్లు! వ్యవసాయాధార గ్రామమిది. కానీ ఈ గ్రామం ఎంచుకున్న ఓ మార్గం ఎనలేని ఖ్యాతికి కారణమైంది. సాధారణ రైతులను మంచి కర్షకులుగా మార్చింది. రూ.5ల ఆకుకూరల కట్ట ఆ గ్రామంలో చీకూచింతా లేకుండా చేస్తోంది.
ఆ గ్రామంలో రైతులు నీటి అవసరం ఎక్కువగా ఉండే సంప్రదాయ పంటలను కాదనుకున్నారు. నీటిని పొదుపుగా వాడుకునే ఆకు కూరలను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని 70కి పైగా కుటుంబాల్లోని రైతులకు ఆకుకూరల పెంపకమే జీవనాధారం. ఊరికి ఆనుకొని బొద్దుల వాగు ప్రవహిస్తుంది. ఆ వాగు అంచే వారి సాగు‘బడి’. అక్కడున్న భూముల్ని చిన్నచిన్న మడులుగా తయారు చేసి పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కొయ్య తోటకూర, కొత్తిమీరలను ఏడాది పొడవునా పండిస్తారు. పచ్చతివాచీ పరచినట్లున్న వాగు అంచులు ఆ గ్రామానికి కొత్త అందాలను అద్దుతున్నాయి. ప్రతి 45 రోజులకొకసారి ఆకు కూరలు చేతికందేలా పక్కా ప్రణాళికతో మడులను తయారు చేసి పెంపకం చేపడతారు. రోజూ గ్రామం నుంచి 15 వేలకు పైగా ఆకు కూరకట్టలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు తరలివెళతాయి. ఏడాదిలో 300 రోజులకు దీనిద్వారా రూ.1.57కోట్ల ఆదాయం అందుతుంది. ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల కరవు తాండవిస్తున్న పరిస్థితుల్లోనూ ఆ ఛాయలు ఈ ఊరి పొలిమేరల్లోకి రాకపోవడం గమనార్హం.