రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుండే ఎందుకు జరుగు చున్నాయి? అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు?
రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుండే ఎందుకు జరుగు చున్నాయి?
అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు?
భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్రతీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయినా.. కూడా ఇక్కడే నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెలుతూ ఉంటాయి. ఎందుకు అంటే? అన్ని విధాలా రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రం అది. ఇంత ప్రత్యేకత ఏంటి..? ఏమిటి ఆ అనుకూలతలు అంటారా..?
Why rocket launches from Andhra Pradesh?
రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు.
అందులో మొదటిది భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూ భ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రాలను ఒకసారి పరిశీలిస్తే.. భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్ గయానాలోని కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు తమ రాకెట్లను ప్రయోగిస్తున్నాయి.
భూ భ్రమణానికి-రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి?
భూ భ్రమణానికి-రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తవచ్చు. దీనికి శాస్త్రవేత్తలు చెప్పేది ఒక్కటే.. గంటకు లక్షా 8వేల కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తిరుగుతున్న దిశలో రాకెట్‌ను ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం అందుకుంటుంది. అయితే, భూపరిభ్రమణ వేగం అంతటా ఒకేలా ఉండదు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మన శ్రీహరి కోటలో ఈ అనుకూలత చాలా కీలకమైంది. మరోవైపు.. శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు.
సుదీర్ఘ తూర్పు తీరప్రాంతం:
రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది. కానీ, శ్రీహరి కోట చుట్టూ.. బంగాళాఖాతం, పులికాట్ సరస్సు ఉంటాయి. ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారం గానీ, ఇళ్లు కానీ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా.. రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.
రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయం:
రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోట ఈ పరీక్షలో కూడా పాసైంది. శ్రీహరికోటకు సమీపంలోనే రైలు, రోడ్డు, నౌకామార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి రహదారి అతిసమీపం నుంచి వెలుతోంది. దీంతోపాటు.. శ్రీహరికోటకు ఇరవై కిలోమీటర్లలో రైల్వే స్టేషన్, 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై పోర్టు ఉన్నాయి.
ప్రయోగాలకు అనుకూల వాతావరణం:
రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
భూమి స్వభావం కూడా ముఖ్యమే:
రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది ‘రాకెట్ ప్రయోగాల కోట’ అయింది. నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తి స్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది. ఈ ఐదు కీలక అనుమతులు శ్రీహరికోటను అంతర్జాతీయ రాకెట్ ప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాయి. భారతదేశ కీర్తితో పాటు… ఆంధ్రప్రదేశ్ పేరుకు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకువచ్చాయి.