మేళ్లచెరువు శివలయం…
1. మేళ్ల చెరువు.. కోదాడకు 20 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. సిమెంటు ఫ్యాక్టరీల బెల్టు. సున్నపురాయి నిక్షేపాలు అపారంగా వున్న ప్రాంతం.
2. మేళ్ల చెరువులో శివాలయాన్ని కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించారు. శాసన ఆధారాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలోనే శిలాశాసనం వుంది.
3. ఆలయంలోని శివలింగం ప్రత్యేకతలు అనేకం వున్నాయి.
4. వందేళ్ల వ్యవధిలో ఓ బెత్తెడు చొప్పున శివలింగం నిలువుగా పెరుగుతూ వుంటుంది. గడచిన ఐదు వందల సంవత్సరాలలో పెరిగిన పరిణామాన్ని సంకేతిస్తూ శివలింగంపై గుంటలు కూడా కనిపిస్తూ వుంటాయి.
5. లింగంపై అమర్చిన కలశంనుంచి బొట్టుబొట్టుగా కారే నీరు.. ఆ గుంటలను ఏర్పరుస్తుంటాయి. ఆ గుంట వైశాల్యం పెరుగుతుంటుంది. గడచిన పాతికేళ్లుగా అక్కడ అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణ పండితుడు ఈ విషయాన్ని నిర్ధారించారు. వందేళ్ల వ్యవధిలో అది శివలింగం ముఖ భాగంలోకి అంతకు ముందున్న గుంటల్లో భాగంగా చేరి, లింగం పరిణామం మరింత పెరుగుతుంది. అయితే.. పురావస్తు శాఖవారు దీనిపై పరిశోధన కానీ, శాస్త్ర నిర్ధారణ కానీ చేసిన దాఖలాలు లేవు.
6. అంతకు ముందు రాత్రే.. రాళ్లు పెరుగుతాయా అని మిత్రుడు అడిగినప్పుడు.. యాగంటి బసవన్న ప్రస్తావన తెచ్చాను. పురావస్తు శాఖవారు ఆ బసవన్న పెరుగుదలను నిర్ధారించారు.
7. మేళ్ల చెరువు శివయ్యను నిజరూపంలో దర్శించుకోగలిగే అదురుష్టం కలిగింది. తర్వాత వెండి తొడుగు కప్పి, కుంకుమలతో అలంకరించారు. అది కూడా చూడగలిగాను.
8. మేళ్ల చెరువు శివలింగం అగ్రభాగాన.. కొద్దిగా వెనుకవైపుగా ఒక రంధ్రం వుంటుంది. అందులోంచి నిరంతరం నీటి ఊట వుంటుంది. అదేదో బొక్క పడి వుంటుంది.. పూజారిగారు చేసే అభిషేకాలు, కలశంనుంచి వచ్చే నీటితో ఆ బొక్క నిండుతోంది తప్ప.. ఊటలేదు, గీటలేదు అని నాలాగే ఎవరైనా అనుకుంటారు.
9. అసలు దీని లోతు ఎంతో అంతు చూద్దామని, నాబోటి, మీబోటి హేతువాదులు, నాస్తికవాదులు… మనం బోరుబోవుల్లో వేస్తామే.. అలాగ.. ఒక రాయికి తాడు కట్టి దింపారు, దింపారు కానీ.. లోతు తెలియలేదు. తాడుని వెనక్కి లాగినప్పుడు పడిన మరకలు మాత్రం శివలింగంపై మనకు కనిపిస్తాయి.
10. అయితే దేవాదాయ శాఖవారు కూడా కొన్ని పరీక్షలు చేశారు. అభిషేకాలు అన్నీ ఆపేసి, ఊట మొత్తాన్ని తోడి, గుడి తలుపులు పావుగంట మూసేసి, మళ్లీ వెళ్లి చూస్తే.. గుంట నిండే వుంది. అలా మూడుసార్లు పరీక్షలు జరిగాయి.
11. ఆ ఊట ఎక్కడినుంచి వస్తోందో ఎవరికీ తెలియదు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ ప్రాంగణంలో వేసిన నాలుగు బోర్లు కూడా ఫెయిలయ్యాయి. కానీ.. ఈ నిరంతర ఊట.. అది కూడా శివలింగంపై.. శివుడి శిరస్సున గంగ ప్రవహించినట్టుగా వుంటుంది.
12. అంతరాలయంలోనుంచి చూసినప్పుడు.. ఆ ఊట గుంట నేరుగా కనిపించదు. అందుకే పూజారి.. గర్భాలయంలో శివలింగం వెనుక నిలబడి ఒక అద్దం పెట్టి చూపిస్తుంటారు. ఆ గంగాజలాన్ని భక్తులపై చిలకరించి ఆశీర్వదిస్తారు. శివలింగం వెనుక అర్ధనారీశ్వరీ రూపాలు కూడా వుంటాయి. వాటిని కూడా అద్దంలోంచి చూడవచ్చు.
13. శివలింగం రాతి స్వభావం.. ఒక సున్నపు రాయిలాగా తెల్లగా వుంటుంది. కానీ ఆ ప్రాంతంలో మామూలుగా దొరికే సున్నపురాయి కంటే.. అత్యంత అరుదైన, అమూల్యమైన సున్నపురాతితో దానిని తయారు చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. సున్నపురాయికి వుండే ఉష్ణస్వభావాన్ని శీతలీకరించే ప్రక్రియలో భాగంగా కాకతీయులు సహజ శీతలీకరణ యంత్రంగాన్ని ఏర్పాటు చేసి వుంటారని, అందుకు సరిగ్గా మేళ్ల చెరువులోని నిర్దిష్ట ప్రాంతాన్ని ఇంజనీరింగ్ ప్రతిభతో, వాస్తు ప్రతిభతో ఎంపిక చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతో మెటిక్యులస్ ప్లానింగ్ వుంటే తప్ప ఆ ఆలయ నిర్మాణం, ఆ శివలింగ నిర్మాణం అలా సాగి వుండదు.
14. మనకు దైవభక్తి వుండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఇటువంటి నిర్మాణాలను కాపాడుకోవడానికి భక్తి అనేది, దేవుడు అనేవాడు మనకు మాధ్యమం అయితే కొంపలు మునిగేదేమీ లేదు. సెక్యులరిజానికి, లౌకికవాదానికి వాటిల్లే ముప్పు ఏమీ వుండదు. మన చారిత్రక, వారసత్వ, విజ్ఞాన కేంద్రాలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు?
15. ఆలయం మండపంలో సుమారు పదీ పదిహేనుమంది బ్రాహ్మణులు, నాలుగైదు వేర్వేరు విధుల్లో నిత్యం వుంటారు. గ్రహశాంతి ఇత్యాది క్రతువులను నిర్వహిస్తుంటారు. నేరుగా శివుడి సమక్షంలోనే వీటిని నిర్వహించుకోవచ్చు.