సుష్మాస్వరాజ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు …
విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు …
భారతీయ జనతా పార్టీలో మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే చదివారు. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ అనేక కీలక పదవులు నిర్వహించారు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. అదేసమయంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. మిజోరాం గవర్నరుగా పనిచేశారు. 1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిచారు.
రాజకీయాలు…
1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరినారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్యం మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందినారు. 1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు .1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైనారు. 1996లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం తరువాత 1998 అక్టోబర్ లో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తో ఆమె పై భారతీయ జనతా పార్టీ సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దింపింది. ఇక్కడ ఆమె సోనియా చేతిలో ఓటమి పాలయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసారు. 2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగారు.