బీమా సంస్థలకే లాభాల పంట… రైతులను ఆదుకోని పథకాలు…
ప్రకృతి ప్రకోపాలకు పంట కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు జీవితాలు దుర్భరం కావడం ఈ దేశంలో సర్వసాధారణం. దుర్గతి నుంచి రైతులను కాపాడటానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పంట బీమా పథకాలతో ప్రయోగాలు చేస్తూ వచ్చాయి.
దురదృష్టవశాత్తు అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పంట బీమా పథకాలకు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసినా రైతులకు ఒరిగిందేమీ లేకపోగా, వారి పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనదీ ఇదే వరస. అయినా కూడా కేంద్రం ఈ పథకాన్ని కొంత సంస్కరించి కొనసాగించాలని చూస్తోందే తప్ప, రైతులకు నిజంగా మేలు చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచించడం లేదు. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని రైతుకు నికరమైన ఆదాయం వచ్చేలా చూడాలన్న తపన కనిపించడం లేదు.