దసరా(దశహర) పండుగ విశిష్టత…


మనం తెలియక దసర దసర అని పిలుస్తుంటాం. కానీ దాని యధార్దమైన పేరు *దశహర*. దశ అంటే పది. హర అంటే నశించడం. వర గర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి పది తలలను(దశ) భగవంతుడైన శ్రీ రామ చంద్రుడు సంహరించాడు(హర) కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీ రాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహం, క్రౌర్యం, పాపచింతన, ధ్వేషం అనే పది రకాలైన చెడు గుణాలను నశింపజేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీ రాముడు ఈ దశమి రోజునే దుష్టసంహారం గావించి విజయాన్ని పొందాడు కాబట్టే దీనిని విజయదశమి అని పిలుస్తారు.

మన హిందూ మతంలో ఏ పండగను ఆర్భాటాలకోసమో, వినోదాల కోసమో చేసుకోరు. అమాయకులైన ప్రజలను దుష్టులు హింసించినప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి, ప్రజలను కాపాడుతూ ఉంటాడు. అలా భగవంతుడిని స్మరించుకుంటూ చేసే ఉత్సవాన్నే పండుగగా చేసుకుంటాం. ఈ పండుగ రోజున తలంటు స్నానం చేసి, పూజా మందిరంలో సీతారాములకు పూజ చేసి వడపప్పు, పాయసం, పానకం, పొంగలి, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించి ఇంట్లో ఆయుధ పూజ నిర్వహిస్తారు. రామాలయాలలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాలలో పది రోజుల పాటు సాగే రామోత్సవాలలో ఈ ఆఖరి రోజున లేదా మరుసటి రోజున పార్వేట నిర్వహిస్తారు.

*ఆయుధ పూజ*

ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాముల వారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు. స్కూలుకు, కాలేజీకి వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నాలను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు లాప్ టాప్, ఐడీ కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టర్ తాళాలను శ్రీరాముడి పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు. కొత్త వాహనాలకు లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా, కుటుంబ సభ్యులందరుకీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం.

*పార్వేట విశిష్టత*

విజయదశమి రోజున లేదా మరిసటిరోజున శ్రీరాముడి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా ఊరి పొలిమేర దగ్గరకి తీసుకెళ్ళి గడ్డితో కానీ పాతబట్టలతో కానీ రావణాసురుడిని తయారు చేసి ఉత్సవ మూర్తిగా ఉన్న రాముడి చేతికి నిప్పు అంటించిన బాణాన్ని తాకించి పది తలలున్న రాక్షషుడి బొమ్మను తగలబెడతారు. అంటే దీని అర్ధం మన మనసులో ఉన్న కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహం, క్రౌర్యం, పాపచింతన, ధ్వేషం అనే పది చెడుగుణాలు భగవంతుడి నామమనే నిప్పు చేత తగలబడిపోవాలి. సమాజం పట్ల ప్రేమ భావనతో, అందరికీ చేతనైన మంచి చేస్తూ నవ సమాజాన్ని నిర్మించడమే విజయదశమి పండుగ విశిష్టత. అందరికీ శ్రీరాముడి ఆశీస్సులు మీకు కలగాలని, మీరు ఇంకా పదిమందికి మంచి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

About The Author