సిద్ధిపేట నియోజకవర్గంలోని 8 గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి


• సిద్ధిపేట విద్యుత్ గెస్ట్ హౌస్ లో నియోజక వర్గంలోని 8 గ్రామాల అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో రెండున్నర గంటలు సమీక్షించిన మంత్రి హరీశ్ రావు
• నియోజకవర్గంలోని 8 గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి
• జాతీయ అవార్డులు పొందేలా గ్రామ ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
• జనవరిలోపు బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలవాలి

రాష్ట్రంలోనే తొలిసారిగా మన సిద్దిపేట నియోజకవర్గంలో గొర్రెల హాస్టల్స్ నిర్మించాం. ఇదే తరహాలో బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలువాలన్నదే మన సంకల్పం ..! గొర్రెల హాస్టల్స్, బర్రెల హాస్టల్స్ కు రెండు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఉన్నాయి. ఈ నిర్మాణాల వల్ల రైతులకు, గ్రామ ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విద్యుత్ గెస్ట్ హౌస్ లో గురువారం రాత్రి రెండున్నర గంటల పాటు సెర్ఫ్ డైరెక్టర్ డాక్టర్. అనంతం, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ కనక రత్నం, పశు సంవర్థక శాఖ జేడీ రామ్ జీ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పశు వైద్యాధికారులు, వివిధ ఇంజినీరింగ్ శాఖాధికారులు, నియోజక వర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులతో , ఆ 8 గ్రామాల సర్పంచ్ , ఎంపీటీసీలతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 8 గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అవార్డులు పొందేలా డిల్లీకి వెళ్లి అవార్డుల తేవాలని ఆయా గ్రామ సర్పంచ్, ఏంపీటీసీ, ప్రజాప్రతినిధులు ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న 686 జిల్లాలో మొదటి వందలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని, గుజరాత్, తెలంగాణ మధ్య అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకునే అంశాలపై పోటీ ఉన్నదని ఆ పోటీల్లో మన సిద్ధిపేట జిల్లా, నియోజక వర్గం ఉండాలన్నదే మన ధ్యేయంగా పని చేద్దామని కోరారు. నియోజకవర్గ పరిధిలోని 8 గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు వీటిలో ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, గుర్రాలగొంది, మిట్టపల్లి, నర్మెట, పొన్నాల, జక్కపూర్, గట్ల మల్యాల గ్రామాల్లో జనవరి నెలాఖరు లోపు బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 8 గ్రామాల లోని మూడు గ్రామాల్లో ఇబ్రహీంపూర్, నర్మెట, ఇర్కోడ్ లో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించారు. అదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రత్యేకమైన పథకంలో భాగంగా ఎంపిక చేసిన 8 గ్రామాల్లోని మహిళా సంఘాలను క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేయాలని, ఈ విషయంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
రైతులకు గొర్రెలు అయినా, పాడి పశువులైనా.. ఒక హాస్టల్ లో కట్టి వేస్తే ఎండా కాలం ఫ్యాన్, వాన కాలంలో తడవకుండా రూఫ్, చలి కాలం చలి పెట్టకుండా చుట్టుపక్కల గోడలు ఉంటాయని, ఓపెన్ ఉన్న వైపు చిన్న టార్ఫాలిన్ కడితే చలి పెట్టకుండా వెచ్చగా ఉంటుందని, పశువులైనా.., గోర్రెలైనా ప్రాణం ఉన్న జీవులేనన్నారు. మనుషులుగా మనం.. చలి పెడితే స్వెటర్, వానొస్తే ఛత్రీ, ఎండ కొడితే ఏసీ వేసుకుంటున్నామని., అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారంటూ అదే తరహాలో జీవాల పరిస్థితి కూడా అంతే ఉంటుందని., మనిషి చక్కటి ఆహారం తిని చక్కగా నీడలో ఉంటారో.. జీవాలు కూడా సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.
జీవాలు ఆరోగ్యంగా ఉంటే పాడి పశువులైతే.. పాలు ఎక్కువగా ఇస్తాయని, గొర్రెలైతే.. బలంగా ఉంటే మాంసం ఒక జీవం పై మరో 4 కిలోలు ఎక్కువగా వస్తుందని., దీంతో వ్యాపారం లాభాలు కూడా ఎక్కువగా గడించవచ్చన్నారు. పాడి పశువులైతే.. ఒక లీటరు లేదా రెండు లీటర్లు ఎక్కువగా పాలు ఇస్తే.. మొత్తంగా నెలలో 50 లీటర్లు ఎక్కువగా ఇస్తే 2 వేల రూపాయలు రైతుకు అదనపు ఆదాయం వస్తుందంటూ.. ఇలా పాడి, గొర్రెల రైతులకు జరిగే మేలు గురించి సవివరంగా వివరించారు.
రెండో విషయంలో గ్రామానికి మేలు ఏలా అంటే.. ఊర్లో రోడ్ల పై పేడ, మల మూత్ర విసర్జనలు చేయడంతో గ్రామంలో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం. అలాగే పాడి పశువులను ఇంటి ముందు, పెరట్లో దొడ్డి పెట్టి కట్టేస్తే వాటి మలమూత్రాల వల్ల వర్షాకాలం ఆ ప్రాంతమంతా దుర్వాసన, ఆ పశువుల పేడ, గొర్రెల మల మూత్రాలతో అనేక రకాలుగా దోమలు కూడా బాగా పెరిగి వ్యాధి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు వివరించారు. గొర్రెలను తోడేళ్లు, కుక్కలు కరుస్తాయని రైతుకు నిద్ర కూడా సరిగ్గా ఉండదని.. గొర్రెలకు ఏదైనా వ్యాధి సోకితే.. మందను వదిలి డాక్టర్ వద్దకు వెళ్లాలంటే గొర్రె రైతుకు కష్టం.. అదే గొర్రెల హాస్టల్స్ తో ఆ టెన్షన్ ఉండదని డాక్టర్ అక్కడికే వచ్చి చూసి రికార్డులో సంతకం సైతం చేస్తారని పేర్కొన్నారు. గ్రామంలోని గొర్రెలు, పాడి పశువులకు వైద్యం అందించేందుకు డోర్ స్టెప్.. మన వద్దకే పశువుల డాక్టర్ వచ్చి మూగ జీవాలకు వైద్యం అందించే సౌకర్యం కలిగి రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు గడ్డి విత్తనాలు సబ్సిడీ పై ఇవ్వడం, మహిళలకు కుటీర పరిశ్రమలలో భాగంగా ఇర్కోడ్ లో చికెన్, మటన్ చట్నీలు, మిట్టపల్లిలో పప్పు దినుసులు, చిన్నగుండవెళ్లి లో అల్లం పేస్ట్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, మదర్ యూనిట్- నాటుకోళ్లు, పౌడర్ తయారీ కేంద్రం.. ఇలా ఇదే విధంగా మిగతా 6 గ్రామాల్లో చేద్దామని ప్రజాప్రతినిధుల చొరవతోనే సాధ్యమని, ఇందుకు కావల్సిన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల ఏంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author