ఖగోళ శాస్త్రం భరత ఖండం ప్రపంచానికి పెట్టిన భిక్ష…
కొద్ది సంవత్సరాల క్రితం ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఏప్రిల్-2014 న మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలో సింహస్త కుంభమేళా ఉత్సవం ప్రారంభమైంది. ఉజ్జయిని లాంటి చిన్న పట్టణంలో దాదాపు రెండు నుండి మూడు కోట్ల జనాభా నెల, నెలన్నర రోజుల్లో వచ్చారు. వారందరూ క్షిప్రా నదిలో స్నానం చేసి పుణ్యం సంపాదించుకుని తిరిగి వెళ్లారు. అదే ఉజ్జయిని పట్టణంలో ఒక చారిత్రక భవనం విలసిల్లుతోంది. అది “వేదశాల” అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనా శాల. వచ్చిన భక్తులలో ఎందరు ఈ వేదశాలను చూశారో లెక్క తెలీదు కానీ, ఈ వేదశాల మన భారతీయ ప్రాచీన విజ్ఞాన జ్ఞాన పరంపర యొక్క తెరచిన ద్వారం లాంటిది. ఇందులో ప్రవేశిస్తే ఎవరైనా భారతీయ ఖగోళ శాస్త్రం యొక్క అద్భుతాలను గురించి తెలుసుకుంటారు.
రాజస్థాన్ లో ఉన్న అమేర్ పరిపాలకుడు రాజా సవాయి జయ సింగ్(2) , క్రీ.శ.1833 లో ఈ ఖగోళ పరిశోధనాశాల నిర్మించాడు. అప్పుడు ఆయన మాల్వా ప్రాంతానికి సుబేదార్ గా ఉన్నాడు. ఉజ్జయినిలో మాత్రమే కాక ఈయన ఢిల్లీ,కాశీ, మధుర మరియు జైపూర్లో కూడా ఇలాంటి ఖగోళశాలలు నిర్మించాడు. అన్నిటికంటే ముందు ఢిల్లీలోని ఖగోళ పరిశోధనశాల క్రీ. శ.1714 లో నిర్మించబడింది. దీనిని ‘జంతర్ మంతర్’ అని అంటారు.
ఆ రోజుల్లో ఢిల్లీలో మొగల్ పాదుషాగా మొహమ్మద్ షా ఉండేవాడు. అతని కాలం లనే హిందూ ముస్లిం ఖగోళ శాస్త్ర కారుల మధ్య ‘ కాలగణన ‘ విషయంలో సూక్ష్మత గురించి ఒక చర్చ జరిగింది. అప్పుడు భారతీయ కాలగణనలోని ఖచ్చితత్వాన్ని నిరూపించడానికి రాజ జయసింగ్, ఈ నిర్మాణాలను ఏర్పరిచాడు. ఇవి పూర్తి అయిన తర్వాత దీని ద్వారా తెలిసిన విషయాలు, విలువల వివరణ అత్యంత ఖచ్చితమైనదని నిరూపితమవడంతో మరో నాలుగు ఇటువంటి ఖగోళ శాలలను ఆయన నిర్మించారు.
రాజా సవాయి జయసింగ్ ఖగోళ శాస్త్రంలో మంచి పరిజ్ఞానం కలిగినవాడు. సంస్కృతంలో కూడా ఆయనకు ఎంతో పాండిత్యం ఉంది. వీటితోపాటు మొగలుల సహవాసంలో అరబ్బీ, పారసీ భాషలు కూడా నేర్చుకున్నాడు. విశేషమేమిటంటే రాజా జయ సింహకి మరాఠీ భాష కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కొంతకాలం ఔరంగాబాద్, దౌలతాబాద్, నాగర్ వంటి అనేక ప్రాంతాలలో గడిపాడు. ఔరంగజేబు తన చతురంగ సేనలతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై దండెత్తి ఓడించి హైందవ స్వరాజ్యాన్ని నాశనం చేసే ఉద్దేశంతో మహారాష్ట్రలో చొరబడినప్పుడు అతడు రాజా జయసింహను తన సైన్యంతో చేతులు కలుపవలసిందిగా ఫర్మానా జారీ చేశాడు. అయితే అప్పుడు జయసింహ వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ విషయంలో చాలా తర్జనభర్జనలు పడి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఔరంగజేబు స్వయంగా తన దూతను పంపించడంతో అతని సైన్యంలో చేరక తప్పలేదు.
మహారాజా జయసింహ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఎంతో తీరుబడి లేని పరిపాలనా బాధ్యతల మధ్య కూడా అక్కడ ఉన్న ఎన్నో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసేవాడు. అక్కడి నుండి వచ్చేటప్పుడు ఎన్నో విలువైన గ్రంథాలను సేకరించి తన భాండాగారం లో భద్రపరిచాడు.
రాజా జయసింహను ఖగోళశాస్త్రంలో నిపుణుడిని చేసిన ఘనత ఒక మరాఠి వ్యక్తికి దక్కుతుంది. ఆయన పేరు పండిత జగన్నాధ సామ్రాట్. పేరులో సామ్రాట్ అని ఉన్నప్పటికీ ఈయన రాజు కాదు, జయసింహకి ఖగోళశాస్త్రం బోధించడానికి నియమించబడిన బ్రాహ్మణ పండితుడు మాత్రమే. ఈ జగన్నాధ పండితుని ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఎంతో విశేషమైనది. ఈయన “సిద్ధాంత కౌస్తుభం” అనే గ్రంధాన్నే కాక యూక్లిడ్ రేఖా గణితాన్ని అరబ్బీ నుండి సంస్కృత భాషలోకి అనువాదం చేశాడు. ఈ జగన్నాధ సామ్రాట్ నేతృత్వంలో రాజ సవాయి జయసింహ ఈ ఖగోళ పరిశోధనాశాలలని నిర్మించారు. వీటి నిర్మాణంలో ఎలాంటి లోహాలను ఉపయోగించ లేదు. ఎందుకంటే యూరోపియన్ ఖగోళశాస్త్రకారులు తమ ఉపకరణాలలో వివిధ లోహాలను వాడటం వల్ల ఈ ధాతువులు వాతావరణ మార్పులనుసరించి సంకోచ వ్యాకోచాలకు గురికావడం వలన అనేక సందర్భాలలో వారి ఖగోళ గణన తప్పుగా జరిగేది. కానీ రాజా జయసింహ చేత నిర్మించబడిన ఐదు పరిశోధనా శాలలలో కేవలం సున్నం, ఇంకా ప్రత్యేక ఆకారాలతో నిర్మించిన రాతి కట్టడాల సహాయంతో అన్ని యంత్రాల నిర్మాణం జరిగింది. అందువలన ఇక్కడ అన్ని సరైన ఫలితాలను ఇస్తాయి. దురదృష్టవశాత్తు ఈ రోజున ఈ ఐదు ఖగోళ పరిశోధన శాలలలో కేవలం ఉజ్జయినీ, జైపూర్ లలో మాత్రమే సరిగా పనిచేస్తున్నాయి. మధురలోనిది పూర్తిగా నాశనం చేయబడింది. కాగా కాశీ లోనిది అత్యంత శిథిలావస్థలో ఉంది. ఉజ్జయినీ వేదశాలలో సామ్రాట్ యంత్రం , నాడీ వలయ యంత్రం, దిగంశ యంత్రం , భిత్తి యంత్రం, శంఖు యంత్రం నిర్మించబడ్డాయి. ఈ పరిశోధనశాల యొక్క నిర్మాణ కాలం మరాఠీలు మాల్వా ప్రాంతంలోకి రావడానికి కొద్ది సంవత్సరాల ముందే జరిగింది. తరువాత కాలంలో 1925 లో గ్వాలియర్ కు చెందిన ‘షిండే’ ప్రభుత్వం ఈ వేదశాల కు కావలసిన మరమ్మతులు చేయించి సంరక్షణ చేపట్టింది.
సవాయ్ జయ సింహుడికి ఈ 5 వేదశాలలలో ఉజ్జయినీ వేదశాలే ఎందుకు ప్రముఖమైనది? ఎందుకంటే ప్రాచీన కాలంలో అంటే క్రీస్తు పూర్వం 400 ఏళ్ల క్రితమే భూమి యొక్క అక్షాంశరేఖ ఉజ్జయిని మధ్యగా వెడుతుందని అనుకునేవారు. అందుకని ఉజ్జయినికి భారతీయ ఖగోళ శాస్త్ర అధ్యయనంలో ఒక విశేష స్థానం ఇవ్వబడింది.
మహారాష్ట్రలోని వాషిం పట్టణం, ప్రాచీన కాలంలోని ‘వాకాటక’ రాజవంశీయుల రాజధాని “వస్తగుల్మ “. ఈ వాషీ లో ప్రముఖమైన ‘మధ్య మహేశ్వర ఆలయం’ ఉన్నది. ప్రాచీన కాలంలో ఈ ఆలయంలోని శివలింగం మీదుగా క్షితిజ రేఖ వెడుతుందని అనుకునేవారు. ఆశ్చర్యమేమిటంటే భూమిని చాపలా పరిస్తే ఈ రెండు పట్టణాలు ఒకే రేఖ మీదికి వస్తాయి. భాస్కరాచార్యుడు తన గణిత గ్రంథం “లీలావతి” లో ఈ ‘దేశాంతర రేఖ ‘ ప్రస్తావన చేశాడు. ఈ ప్రస్తావనను అనుసరించి ఉజ్జయిని (ఈ గ్రంథంలో దీనిని ‘అవంతిక ‘అనే ప్రాచీన నామం తో సంబోధించారు) ఇంకా ప్రస్తుత హర్యానాలోని రోహతక్ పట్టణం మీదుగా ఈ ఊహాజనిత దేశాంతర రేఖ వెళ్తుంది.
ఉజ్జయిని యొక్క ఈ వేదశాల ఒక రకంగా మన ప్రాచీన ఖగోళ శాస్త్రం యొక్క ‘జీర్ణ శరీర ద్వారం’. ఇది కొత్తగా మళ్లీ ఏమీ చెప్పలేదు కానీ, ఏ గ్రంధాలను ప్రమాణంగా తీసుకుని ఈ వేదశాలను నిర్మించారో ఆ గ్రంధాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా మన ఎదురుగా ఉన్నాయి.
అయితే ఈ వేదశాలలు ప్రపంచానికి కొత్తా కాదు, ఆశ్చర్యమూ కాదు. జయసింహుడు ఈ ఐదు వేదశాలలు నిర్మించే నాటికి 13వ శతాబ్దంలో ఇరాన్లో క్రూర చంఘిజ్ ఖాన్ మనమడు, హలాకుఖాన్ ‘మరాగా ‘ అనే ప్రాంతంలో ఒక వేదశాలను నిర్మించాడు. జర్మనీలోని కాసల్ లో 1561 లోనే సమయాన్ని చూపించే వేదశాల ఉంది. భారత్ లోని వేదశాలల ప్రత్యేకత ఏమిటంటే ఇవి అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో, ఖగోళ శాస్త్రం యొక్క అనేక అంశాలను, భాగాలను, వాటి ప్రత్యేకతను ప్రదర్శిస్తూ నిర్మించబడ్డాయి.
ఉజ్జయినిలోని ఈ ఖగోళ ప్రదర్శనశాల యొక్క ప్రాచీన ఉపకరణాల ద్వారా సెకండ్ లోని సగభాగం కంటే తక్కువ వ్యత్యాసం ఉన్న సమయాన్ని కూడా తెలుసుకోగలం.
అయితే ఇవన్నీ చూశాక అసలు ఇంత జ్ఞానం ఎక్కడిది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. జగన్నాధ సామ్రాట్, సవాయి జయసింహుడు ఎక్కడి నుండి ఈ జ్ఞానాన్ని వెతికి తీసుకువచ్చారు? దీనికోసం మనం మన చరిత్రలో చాలా వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది.
మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ఉటoకింపులు మన గ్రంథాలలో కనబడతాయి. లగధ ఋషి రచించిన ‘వేదాంగ జ్యోతిషం’ అనే గ్రంథం, పేరులో జ్యోతిషం అని ఉన్నా ఇది అనేక ఖగోళ శాస్త్ర విషయాలను చర్చించింది. క్రీస్తుపూర్వం 1350 సంవత్సరాల క్రితం ఉన్న కాలావధిని ఈ ఋషి జీవిత కాలం గా చెప్తారు. ఈ గ్రంథంలో 30 రోజులకు ఒక నెలగా భావించి చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి 3300 సంవత్సరాలకి పూర్వమే భారతదేశంలో ఖగోళ శాస్త్రం యొక్క సంపూర్ణ జ్ఞానం అందుబాటులో ఉంది. దీని కంటే ముందుగానే, అంటే లగధ ఋషి తాను ప్రత్యేకంగా ఏమి కొత్తగా కనుగొన్నట్లు చెప్పరు. అంటే ఆయన తన కంటే ముందే ఉన్న పరిజ్ఞానాన్ని మరింత విస్తృత పరిచినట్లు తెలుస్తోంది.
దౌర్భాగ్యం ఏమిటంటే భారత్ లో ఈ ప్రాచీన గ్రంథాలు ఏవీ అందుబాటులో లేవు. ముస్లిం దురాక్రమణ కాలంలో అనేక విలువైన గ్రంధాలు నాశనమయ్యాయి. తరువాత కాలంలో కూడా మిగిలిన గ్రంథాలను చాలా వరకు బ్రిటిష్ పాలనాధికారులు వారితోపాటు ఇతర దేశాలకు తరలించారు.
ఇలాంటి వాటిలో ఒకటి ఖగోళ శాస్త్రంపై ఆధారపడి రాసిన ‘నారదీయ సిద్ధాంత గ్రంథం’. ఇది భారతదేశంలో లేదు. కానీ, బెర్లిన్ లోని ఒక ప్రాచీన పుస్తకాలయం లో ‘నారద సంహిత’ అనే గ్రంథం ఉంది (weber catalogue no.862), అలాగే ఖగోళశాస్త్ర ఆధారితమైన ‘ధర్మత్తారా పురాణం’, ఇది ‘సోమ- చంద్ర ‘సిద్ధాంతంపై ఒక సంక్లిష్టమైన గ్రంథం. ఇది కూడా అక్కడ పుస్తకాలయంలో ఉంది.(weber catalogue near 840). ప్రాచీన ఖగోళ శాస్త్రంలో “వశిష్ట సిద్ధాంతం” ఎంతో ప్రముఖమైనదిగా భావించబడింది. సూర్య సిద్ధాంతంతో పోలికలు కలిగిన ఈ సిద్ధాంత గ్రంథం కూడా భారత్ లో లభించదు.
హిందీ మూలం : ప్రశాంత్ పోలే.
తెలుగు అనువాదం : శ్రీమతి పులిగడ్డ రాధాదేవి
సేకరణ