ATM హైటెక్ కేటుగాడు…
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తాడు …
ఖాతాలో మాత్రం డబ్బు కట్ కావు ..
వామ్మో వీడో పెద్ద హైటెక్ కేటుగాడు..
ఖాతాదారుల నిల్వలు యథాతథంగా ఉండటం.. డబ్బు మాత్రం ఏటీఎం నుంచి విత్ డ్రా అవుతుండటంతో అనుమానం వచ్చిన ఎస్‌బీఐ అధికారులు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్‌డీ రోడ్డులోని మెడ్‌క్విస్ట్ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎం ఉంది. ఇందులో ఓ ఖాతాదారుడు తనకు ఏటీఎంపై ఉన్న పరిజ్ఞానంతో తన కార్డు ద్వారా పలు దఫాలుగా రూ.14,72,500 నగదును డ్రా చేశాడు. ఏటీఎంలో నుంచి నగదు బయటకు వస్తే నిల్వ నుంచి కట్ అవుతాయి. అయితే ఇతడు నగదు బయటకు వచ్చే సమయంలోనే తన చేతిని అందులో పెట్టి, తన వద్ద ఉన్న తాళంతో మిషన్‌ను ఆఫ్ చేసి నగదును కాజేసేవాడు. ఇలా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు 25వ తేదీ వరకు పలుమార్లు ఈ ఏటీఎం నుంచి నగదును తన కార్డు ద్వారా కాజేశాడు. ఏటీఎంలో ఉంచిన నగదులో తేడాలు వస్తున్నట్లు ఆడిట్‌లో తెలిసింది. బ్యాంకు అధికారులు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలను ఈ నెల 11న పరిశీలించగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కార్డు, తాళంను ఉపయోగించి నగదును కాజేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ శోభారాణి ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇతడు గతంలో ఏటీఎంలలో పనిచేసి మానేసిన వ్యక్తే అయి ఉంటాడని భావిస్తున్నారు.