చిక్కుల్లో జగన్ సర్కారు హైకోర్టులో కోర్టు ధిక్కరణకేసు…


*ఆ రెండు ఆఫీసుల తరలింపు జీఓలే కారణం*

*కోర్టుకు సీఎస్‌నూ పిలిపిస్తారా?*

*దానిపై సంతకం పెట్టిందెవరు?*

*సీఎస్ చేయకపోతే ప్రవీణ్‌కే చిక్కులు*

*సెలవుపై వెళ్లనున్న సీఎస్?*

ఏపీ సీఎం జగన్ సర్కారుకు కోర్టులో పెద్ద చిక్కే ఎదురుకానుంది. తాను ఆదేశించేంతవరకూ ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకూడదని, ఒకవేళ దానిని ధక్కరిస్తే వారి జీతాలనుంచి ఆ ఖర్చు రాబడతామని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. అయినా దానిని ఖాతరు చేయని జగన్ ప్రభుత్వం వెలగపూడి సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసులను కర్నూలుకు తరలిసూ,్త పరోక్షంగా అర్ధరాత్రి ఇచ్చిన జీఓ నెంబర్ 13పై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

తాజా పరిణామాలు ప్రభుత్వ అధికారులకు ప్రాణసంకటంగా పరిణమించాయి. అసలు దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ సంతకం చేయలేదని, సీఎంఓ ముఖ్య కార్యద ర్శి ప్రవీణ్ ప్రకాష్ సంబంధిత ఫైలుపై సంతకం చేసి, ర్యాటిఫికేషన్ కోసం సీఎస్‌కు పంపించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎల్వీని ప్రధాన కార్యదర్శి నుంచి పంపించేసిన ప్రవీణ్ ధాటికి, ప్రస్తుత సీఎస్ నీలం సహానీ కూడా తట్టుకోలేపోతున్నారన్న ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా ఉత్తర్వు ఎలా జారీ అయిందన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అయితే.. హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చింది. మరి ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు హాజరవుతారన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం చేస్తే ఆమె, లేదా ప్రవీణ్ ప్రకాష్ సంతకం చేస్తే ఆయన ప్రతివాదిగా హాజరుకావలసి ఉంటుంది. సహజంగా ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులు పాలకులు చెప్పినట్లే చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారిని ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీ చేయడమో, లేదా అసలు పోస్టింగులు ఇవ్వకుండా నెలల తరబడి వేచిఉండేలా చేయడమో చేస్తుంటారు. గత ప్రభుత్వంలో నిఘా దళపతిగా పనిచేసిన డిఐజి స్థాయి అధికారి, ఏబి వెంకటేశ్వరరావుకు ఇప్పటివరకూ పోస్టింగు ఇవ్వలేదు. బాబు పేషీలో పనిచేసిన సాయిప్రసాద్, సతీష్‌చంద్రకు ఇటీవలే పోస్టింగు ఇచ్చారు.

తాజాగా రైతులు వేసిన కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఎందుకంటే అది కోర్టు ధిక్కరణకు సంబంధించింది కాబట్టి. తాను మళ్లీ ఉత్తర్వులిచ్చేవరకూ ప్రభుత్వ కార్యాలయాలను తరలించకూడదని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా, ప్రభుత్వం దానిని ఖాతరు చేయకుండా ఉత్తర్వులివ్వడమే దానికి కారణం. సహజంగా కోర్టులు ఇలాంటి వాటిని ప్రతిష్ఠగా భావిస్తాయి. ఏ స్ధాయి అధికారినయినా కోర్టుకు పిలిపిస్తారు.

ఇప్పుడు సీఎస్‌గా ఉన్న సహానీ ఆ ఉత్తర్వుపై సంతకం చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆమె సంతకం చేస్తే చిక్కులు తప్పవు. ఇలాంటి ధిక్కరణ కేసులకు సంబంధించి కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కోర్టు ధిక్కరణ కింద జరిమానాతో సరిపెట్టవచ్చు. లేదా దానితోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు లేకపోలేదు. ఆ ఫైలుపై ప్రవీణ్ ప్రకాష్ సంతకం చేసి ఉంటే ఆయన కూడా ఇబ్బంది పడక తప్పదంటున్నారు. అసలు ప్రభుత్వ పాలనాధినేత అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా, ఆమె పేరుతో జీఓ విడుదల కాకుండా, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎలా సంతకం చేస్తారని కోర్టు ప్రశ్నిస్తే ఆయనకే కాదు ప్రభుత్వానికీ ఇబ్బందులు తప్పవు. అంటే సీఎస్ అనుమతి లేకుండా రెండు హోదాల్లో పనిచేస్తున్న సీఎస్ కంటే కిందస్థాయి అధికారి సంతకం చేసేందుకు రూల్స్ అంగీకరిస్తాయా? అన్న చర్చ కూడా తెరపైకి రానుంది. ఆ మేరకు నిబంధ నలు ఉంటే ప్రభుత్వం దానిని కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది.

నిజానికి సీఎస్‌గా వచ్చినప్పటినుంచీ నీలం సహానీ చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నారన్న చర్చ, సచివాలయంలో చాలాకాలం నుంచీ కనిపిస్తోంది. తనను ఏరికోరి నియమించిన జగన్ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా పాలన సాగాలన్న రీతిలో.. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఆమెపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని, ముఖ్యంగా అన్ని ఫైళ్లపై ఆయనే సంతకం చేసి, కేవలం ర్యాటిఫికేషన్ కేసం వాటిని ఆమె వద్దకు పంపిస్తున్నారన్నది మరో చర్చ. గతంలో ఎల్వీ విషయంలోనూ అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అయితే వాటిని సీఎస్ సహానీ సహించలేకపోతున్నారంటున్నారు. ఈ కారణంతోనే ఆమె డిఓపీటీకి లేఖ రాశారన్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది.

పదవీకాలం కంటే ముందుగానే ఆమెతో రాజీనామా చేయించి, ఆమె స్ధానంలో సీఎంఓ ముఖ్య అధికారికి సన్నిహితుడైన సతీష్‌చంద్రను ప్రతిష్ఠించడం ద్వారా పాలనను ఆటంకాలు లేకుండా సాగించుకోవచ్చని, ప్రభుత్వం భావిస్తున్నట్లు గత పక్షం రోజుల నుంచి అధికారుల స్థాయిలో చర్చ జరుగుతోంది. సదరు అధికారి మధ్యవర్తిత్వంతోనే సతష్‌చంద్ర, సాయిప్రసాద్‌కు పోస్టింగు లభించిందన్న ప్రచారం జరుగుతోంది.

About The Author