ప్రముఖ దర్శకుడు బాపు గారికి జయంతి నివాళులు…

ప్రముఖ దర్శకుడు బాపు గారికి జయంతి నివాళులు

 

బాపు రెండక్షరాల తెలుగు గౌరవం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు నిఘంటువు బాపు. తెలుగుదనానికి అచ్చ తెలుగు రూపం బాపు. తెలుగు భాష ఉన్నంత కాలం వెలిగిపోయే పేరు.. బాపు. బుడుగు, సీగానపెసూనాంబ, రెండు జడల సీత పాత్రలకు తన కుంచెతో ప్రాణం పోసిన ఆయన హాస్య చతురతకు ఎవరైనా ‘బాపు’రే అనాల్సిందే. గోదారి సున్నిత వెటకారం ఆయన బొమ్మల్లోనూ మాటల్లోనూ కనిపిస్తుంది. గుండ్రని అక్షరాలకు కాలం చెల్లి వంకర టింకర అక్షరాలే అందంగా మార్చబడింది ఆయన రాత తోనే.
అందమైన బొమ్మలకు అక్షర రూపం ఇచ్చారు ఆయన. బాపు బొమ్మలు గా స్థిరపడిపోయినాయి. బొమ్మలే కాదు అక్షరాలు సైతం ఆయన చేతుల్లో హొయలు పోయాయి. నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో రేఖా చిత్రాలను గీసిన ఆయన నైపుణ్యాన్ని కొనియాడని కళకారుడు లేడు. కాగితంపై కలం పెట్టారంటే ఎడారిలో సైతం పూలు పూయించగల నేర్పు ఆయన సొంతం.అచ్చ తెలుగు ఆడపిల్లను వర్ణించాలంటే ‘బాపు బొమ్మ’లా ఉందనేంతగా ఆయన చిత్రాలు సామాన్యులను హత్తుకుపోయాయి. బాపు రమణ ద్వయం అంటే ఇష్టపడని వారు లేరు. నిజమైన స్నేహం గురించి చెప్పాలంటే బాపు రమణ లనే చెప్పాలి. క్కమాటలో చెప్పాలంటే, రమణ మాటకు బాపు గీత.. బాపు బొమ్మకు రమణ మాట. అంతా ‘బాపూరమణీయమే’. ఎలాంటి భావాలనైనా పలికించే చారడేసి కళ్లు, పొందికగా అల్లిన పొడవైన జడ, నడుము చుట్టూ బిగించి కట్టిన చీరకట్టుతో తెరపై తెలుగుదనాన్ని ఒలికించేవారు. సినిమాల్లో తెలుగుదనం లోపిస్తోందని అనుకుంటున్న సమయంలో బాపు రంగప్రవేశంతో తెలుగుకు పట్టంకట్టినట్లయింది. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన ఖ్యాతి వెలుగొందాలని, స్నేహ ద్వయాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తోంది 9Staar Tv

About The Author