గోవా నుంచి మచిలీపట్నం పోర్టు చరిత్ర…

గోవా నుంచి మచిలీపట్నం పోర్టు వరకు సరుకు రవాణా కోసం మీటరు గేజి రైల్వే మార్గాన్ని నిర్మించాలని భావించిన నాటి ఆంగ్లేయులు ఈ మార్గంపై 1842లో సర్వే ప్రారంభించింది. సర్వే పూర్తయ్యాక గోవా నుంచి రైల్వే మార్గాన్ని గుంతకల్లు వరకు 1867నాటికి పూర్తి చేశారు. ఆ తరువాత దట్టమైన నల్లమల అడవుల్లోని లోయలను కలుపుతూ రైల్వే వంతెన నిర్మించాలని తలపెట్టారు. ఇందుకోసం 1967లో నల్లమల అడవిలోని చలమ, బొగద రైల్వేస్టేషన్ల సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 2,600 అడుగుల ఎత్తున రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ వంతెన నిర్మాణం కోసం సుమారు 420 టన్నుల ఇనుమును వినియోగించారు. బిట్రన్‌లోని బర్మింగ్‌హామ్ ఉక్కు కర్మాగారం నుంచి ఉక్కు సేకరించి లండన్‌లో డిజైన్ చేసి అక్కడే వంతెన విడిభాగాలను అక్కడే నిర్మించి వాటిని సముద్రమార్గం గుండా 1883 నాటికి మచిలీపట్నం చేర్చారు. అప్పటికే నల్లమలలోని దొనకొండ నుంచి మచిలీపట్నం వరకు రైల్వేమార్గం, నల్లమలలో వంతెన నిర్మాణానికి అవసరమైన దిమ్మెల నిర్మాణం పూర్తికావడంతో కావడంతో ప్రత్యేక రైలులో వంతెన సామాగ్రిని చేర్చారు. ఈ సామాగ్రిని 1884వ సంవత్సరం ప్రారంభంలో లోయలకు సమీపంలో రైలు నుంచి కిందికి చేర్చి నిర్మాణపనులు ప్రారంభించారు. అప్పట్లో రైలు మచిలీపట్నం నుంచి దొనకొండ వరకు సుమారు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు రోజుల సమయం తీసుకుందంటే ఎంత జాగ్రత్తగా వంతెన సామాగ్రిని చేర్చారో అర్ధం చేసుకోవచ్చు. వంతెన నిర్మాణానికి సర్వం సిద్ధం కావడంతో బరువైన ఇనుప దూలాలను వంతెన దిమ్మెల పైకి చేర్చడానికి కూలీలు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎలాంటి సాంకేతిక నైపుణ్యం, యంత్ర సామాగ్రి సహాయం లేకుండా కేవలం కూలీలు తమ శరీర బలంతోనే భారీ ఇనుప దిమ్మెలను వంతెన దిమ్మెలపైకి ఒక్కోటిగా చేర్చారు.[6] వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు అక్కడే నివాసం ఉండేలా ఆంగ్లేయులు ఏర్పాట్లు చేసి వారి కోసం నాటి మదరాసు గవర్నర్ ప్రత్యేకంగా ఒక బావిని తవ్వించి తాగునీటి వసతి కల్పించారు. నాటి పాలకులను దొరలని పిలుచుకునే అలవాటున్న కూలీలు బావిని దొరబావిగా, రైల్వే వంతెన స్థలాన్ని దొరబావి వంతెనగా పిలుచుకోవడంతో కాలక్రమంలో అదే పేరు స్థిరపడింది. సుమారు 800 మీటర్ల పొడవున్న వంతెన నిర్మించడానికి కూలీలకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని హంగులు సిద్ధం చేసుకుని 1884వ సంవత్సరం ప్రారంభంలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా ఎట్టకేలకు వంతెన నిర్మాణం పూర్తయి 1887 మధ్య కాలంలో మొదటి రైలును ఆ వంతెనపై పరుగులు తీయించినట్లు రైల్వే రికార్డులు వెల్లడిస్తున్నాయి. లోయ దిగువ నుంచి వంతెన సుమారు 250 అడుగుల ఎత్తు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఎతె్తైన ప్రదేశంలో నిర్మాణమైన ఈ వంతెనకు వేలాది స్ప్రింగులు వినియోగించారు. వీటి కారణంగా నల్లమల అడవిలో చిన్న గాలి వీచినా ఊయల మాదిరి వంతెన ఊగేది. ఈ వంతెనపైకి రైలు ప్రవేశించగానే వంతెన క్రమశిక్షణ కలిగిన సైనికుడి మాదిరి కదలకుండా నిలబడిపోయేది. ఇక రైలులో కూర్చున్న వారికి ఊయల ఊగినంత అనుభూతి కలిగేది. దీనిపై ప్రయాణించ డానికి జనం ఇష్టపడేవారు. అలా ప్రజలు ఎంతో అపురూపంగా అభిమానించే ఆ వంతెన సుమారు 110 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలందించింది. అయితే 1992లో ప్రధాని అయిన దివంగత పీవీ నరసింహారావు గుంటూరు నుంచి గుంతకల్లు వరకు మీటర్‌గేజిని బ్రాడ్‌గేజీగా మార్పు చేయాలని ఆదేశించడంతో దొరబావి వంతెన సమీపంలో మరో మార్గం గుండా నూతన రైలు మార్గాన్ని నిర్మించారు. దాంతో నిరుపయోగంగా ఉన్న దొరబావి వంతెనను కూల్చివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీన్ని ప్రజలు, సంఘాల నాయకులు ఎందరు వ్యతిరేకించినా కేవలం రూ.4 లక్షలకు వంతెన కోసం వినియోగించిన ఉక్కును విక్రయించారు. ఫలితంగా వంతెనను కూల్చి వ్యాపారులు ఉక్కును తరలించుకుపోవడంతో వంతెన కోసం లోయ లోపలి నుంచి నిర్మించిన దిమ్మెలు నాటి చారిత్రాత్మక వంతెనకు సాక్ష్యంగా నిలిచాయి

About The Author