యుద్దప్రాతిపదిక యాదాద్రి ఆలయ నిర్మాణం పనులు…

యుద్దప్రాతిపదిక యాదాద్రి ఆలయ నిర్మాణం పనులు

యాదాద్రిలో ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎంగా కేసీఆర్ రెండవసారి ప్రమాణస్వీకారం చేయడంతో ఏ రోజయినా యాదాద్రికి ఆయన పర్యటన ఖరారు కానుందన్న ఉన్నతాధికారుల సూచనల మేరకు అధికారులు పనులను ముమ్మురం చేశారు. సారొస్తారనే సమాచారం పక్కాగా అధికారులకు అందడంతో ఈ మేరకు పనులను వేగవంతం చేశారు. సుమారు మూడు వేల మంది వివిధ రకాల పనులలో పాల్గొంటున్నారు. ఊపులో జరుగుతున్న పనులతో యాదాద్రి ప్రధానాలయం రోజుకో ప్రత్యేక రూపు సంతరించుకుంటున్నది కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పచ్చిమ, దివ్యవిమానగోపురం, స్వాగతగోపురం రాజగోపురాల నిర్మాణం పనులు శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. యాదాద్రికి ప్రాచీన శిల్పకళ శోభితమై కనువిందు చేస్తున్నాయి. దేశంలోనే అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దడానికి శిల్పులు ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. రాతి శిలలకు తమ ఉలులతో ప్రాణం పోసి అద్భుత రాతి శిలలను ఆవిష్కరిస్తున్నారు. శుక్రవారం శ్రీవారి ప్రధానాలయానికి ఏర్పాటు చేస్తున్న ప్రధానద్వారముకు గడపను ప్రతిష్టించి పూజలు చేశారు.
కొండపైన గల ఏడు గోపురాలు, ప్రధానాలయం, శివాలయం, శ్రీసత్యనారాయణ స్వామివ్రతమండపం ఇతర ప్రాధాన్యత నిర్మాణాల కోసం భారీ తలుపులను నిర్మాణం చేయించారు. వాటిని అమర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. కృష్ణశిలలతో నిర్మాణం జరుపుకుని రాజసం ప్రదర్శిస్తున్న కొండపైన అత్యంత పెద్దదైన సప్తతల రాజగోపురానికి మహానాశికను అమర్చే పనులు గురువారం సాయంత్రం విజయవంతంగా పూర్తిచేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృష్ణశిలలతో ఆధారపీఠం నుంచి మహానాశిక వరకు నిర్మాణం జరుపుకున్న సప్తతల రాజగోపురం మహానాశికను అమర్చేందుకు అవసరమైన నాలుగు వరుసల ఆలంభన పద్మము పనులను గత 13 రోజులుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఆర్కిటెక్టు ఆనందసాయి, ఈఎన్సీ రవీందర్‌రావు, స్తపతులు ఎస్. సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలులు పూజలు చేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. భారీ కేన్ల సహాయంతో పనులు విజయవంతం చేస్తున్నారు. రాజసం ప్రదర్శిస్తున్న రాజగోపురాలను చూసి శిల్పులు..స్తపతులు.. వైటీడీఏ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం జరుపుకున్న ప్రాకారాలు… యాళి స్తంభాల సోయగం…లతలు, పొదికల దరహాసముల మేలు కలయికగా కనువిందు చేస్తున్నాయి.
ఎనిమి కేంద్రాలతో పాటు ఆలయంలో కలిపి మొత్తం మూడు వేల మందితో పనులు ప్రాజెక్టు నిర్మాణాన్ని తలదన్నే విధంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖమండపంలో శరవేగంగా ఫ్లోరింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా రాత్రింభవళ్లు పనులు జరుగుతున్నాయి. స్తపతులు ఎస్. సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలులు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. రాజగోపురాల నిర్మాణం పనులు పూర్తికావడంతో ప్రాకారం పనులలో అష్టభుజజి మండపాల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించారు. రెయిలింగ్ పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ రవీందర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. కొండ చుట్టు జరుగుతున్న రెయిలింగ్ పనులు, సాయిపావని సంస్థ నిర్వహిస్తున్న అన్ని పనులు, రాష్ట్రపతి భవనసముదాయం తదితర పనులన్నీ వేగవంతమయ్యాయి.

త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన

సీఎం కేసీఆర్ పర్యటన త్వరలో ఉండే అవకాశం ఉన్నందున పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 11న ఫలితాలు వెలువడింది మొదలు పనుల వేగానికి రెక్కలొచ్చాయి. సీఎం కేసీఆర్ స్వయంగా పనులను పరిశీలిస్తారని వైటీడీఏ వైస్ చైర్మెన కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతలకు సమాచారం ఉండటంతో పనుల వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించడంతో శిల్పులను, కూలీల సంఖ్యను పెంచారు. తమిళనాడు, ఆంధ్ర నుంచి మరింత మంది శిల్పులను తెప్పించిన కాంట్రాక్టర్ త్వరగా పనులను పూర్తి చేసి కేసీఆర్‌తో శభాష్ అనిపించుకోవాలని భావిస్తున్నారు.
యాదాద్రికొండపై జరుగుతున్న భారీ నిర్మాణాలు రాత్రి వేళ మరింత కనువిందు చేస్తున్నాయి. గోపురాల సముదాయం తీరును వర్ణించలేనిదిగా ఉంది. ఎక్కడా ఏడు గోపురాలతో నిర్మాణం జరుపుకున్న ఆలయం లేకపోవడంతో పాటు నిర్మాణశైలి అంతా ఎంతో పురాతనమైనది అనుసించడంతో ప్రత్యేకశోభ ద్విగుణీకృతమవుతున్నది. రాజుల కాలం నాటి పద్దతులతో జరిగినందున ఎక్కడా సిమెంటు వాసనలు లేక బెల్లం కరక్కాయతో నిర్మాణం పనులు చేసినందున ప్రత్యేకతను సంపాదించుకున్నాయి. గోపురాలకు చెక్కిన లతలు, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని తెలిపే విగ్రహాల అమరిక ఎంతో ఆకట్టుకుంటున్నది.

About The Author