రెండో దశలో కరోనా కఠిన నియంత్రణకు ఇదే కీలకమైన దశ..
మూడో దశలోకి ప్రవేశిస్తే ప్రమాదం
‘‘మనదేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడు రెండో దశలో ఉంది. వైరస్ వ్యాప్తి మూడో దశలోకి (సామాజిక వ్యాప్తి-కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ప్రవేశించడాన్ని ఆపడానికి భారతదేశానికి ఉన్న గడువు కేవలం 30 రోజులే’’
..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ చేసిన హెచ్చరిక ఇది! వైరస్ వ్యాపించడంలో ఆయన చెబుతున్న దశలేమిటి? ఏ దశలో వైర్‌సను ఎలా నియంత్రించవచ్చు? అనే అంశాలను పరిశీలిస్తే..
మొదటి దశ
చైనా, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలకు వెళ్లొచ్చిన వారికి మాత్రమే వైరస్ పాజిటివ్‌గా వస్తుంది. ఉదాహరణకు.. దేశంలోనే తొలి ముగ్గురు కరోనా బాధితులు చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న కేరళవాసులు. అక్కడి నుంచి వచ్చాక వారికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అలాగే మన హైదరాబాదీ కూడా దుబాయ్‌లో ఆ వైరస్ బారిన పడి ఇక్కడికి వచ్చారు. తొలి దశలో బయటపడ్డ కేసులన్నీ ఇలాంటివే.
రెండో దశ
విదేశాలకు వెళ్లి కరోనా బారిన పడి మనదేశానికి వచ్చినవారి కుటుంబసభ్యులు, సహోద్యోగులకు వైరస్ సోకే దశ ఇది. దేశంలో ప్రస్తుతం ఈ దశ నడుస్తోంది. ఈ దశను ‘లోకల్ ట్రాన్స్‌మిషన్’గా వ్యవహరిస్తారు.
మూడో దశ
ఇది అత్యంత కీలకమైనది. ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల వారికి వైరస్ పెద్దఎత్తున వ్యాపిస్తుంది. చూస్తూ చూస్తుండగానే వైరస్ వేలాది మందికి సోకుతుంది. మరణాల సంఖ్య భారీగా పెరగడం మొదలవుతుంది.
నాలుగో దశ
వైరస్ నియంత్రణ చెయ్యి దాటిపోయే దశ. ఇప్పుడు ఇటలీ, ఇరాన్ ఈ దశలోనే ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆలస్యంగా మేలుకున్నా.. కఠినంగా కట్టడి చర్యలు తీసుకోవడంతో ఆ దేశంలో తగ్గుముఖం పట్టింది. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి.
వ్యవస్థలు కుప్పకూలే ముప్పు
వైరస్ వ్యాప్తి మూడు, నాలుగు దశల్లోకి ప్రవేశిస్తే.. ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అందుబాటులో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది సరిపోరు. ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లు నిండిపోతాయి. రోజూ వందలు-వేల సంఖ్యలో కొత్తగా వైరస్ బారిన పడుతుంటారు. చైనాలో అలాంటిస్థితిలోనే పదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి.. 1500 పడకల ఆస్పత్రి.. నిర్మించారు. పెద్ద పెద్ద హోటళ్లను, ఇతరత్రా నిర్మాణాలను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చేశారు. అక్కడ బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల అది సాధ్యమైందిగానీ.. మనలాంటి దేశాల్లో అది దాదాపు అసాధ్యం.
అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిన ఇటలీ వల్ల కూడా కావట్లేదు. రోగులకు చికిత్స చేయడానికి సరిపడా ఆస్పత్రులు సరిపోక.. 80 ఏళ్లు దాటినవారిని చేర్చుకోకూడదనే దారుణమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇటలీ సర్కారు పడింది. అలాంటి పరిస్థితి మనకు రాకూడదనుకుంటే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేయాలి. ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాయి. కానీ అది సరిపోదని.. ప్రజల్లో కూడా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు ప్రజలకు చేస్తున్న సూచనలేంటంటే..
ప్రభుత్వం బడులకు సెలవులు ఇచ్చింది కదాని ప్రయాణాలు పెట్టుకోవద్దు. కరోనా బారిన పడ్డ హైదరాబాద్‌వాసి బెంగళూరు నుంచి బస్సులోనే ప్రయాణించిన సంగతి గుర్తుపెట్టుకోవాలి.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. వీలైనంత వరకూ ఇళ్లల్లోనే ఉండాలి.
జలుబు, దగ్గు, జ్వరం వంటివాటితో బాధపడేవారంతా అది కరోనానే అని భయపడాల్సిన పన్లేదు. కానీ.. అలాంటివారు తాము స్వయంగా ఇటీవలికాలంలో విదేశాలకు వెళ్లొచ్చినా, విదేశాలకు వెళ్లొచ్చినవారికి దగ్గరగా మెలిగినా అనుమానించాల్సిందే. వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిందే.
ఒకవేళ వారికి వైద్యపరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. ముందు జాగ్రత్త చర్యగా కనీసం 14 రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండడం మంచిది. వీలైతే కుటుంబసభ్యులను కూడా తాకకుండా ఒక గదికి పరిమితం కావాలి. ఎందుకంటే.. వైరస్ సోకిన 14 రోజుల దాకా కొందరిలో లక్షణాలు బయటపడవు. పరీక్షల్లో నెగెటివ్ వస్తుంది. ఆ భరోసాతో వారు బయట తిరిగి మరింతమందికి అంటిస్తారు. చైనా, ఇటలీల్లో ఇలాంటి ‘తప్పుడు నెగెటివ్’ బాధితుల వల్లే వైరస్ విస్తృతంగా వ్యాపించింది.
చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, హ్యాండ్ శానిటైజర్ల వంటివి వాడటం వంటివి ముందు నుంచీ అందరూ చెబుతున్నవే. దశలతో సంబంధం లేకుండా అందరూ కచ్చితంగా పాటించాల్సిన నియమాలు.
దయచేసి సాద్యమైనంత మందికి ఈ సమాచారం అందిద్దాం. తద్వారా కరోనా మహమ్మారి నిర్మూలన లో భాగస్వాములు అవుదాం.