ప్రీపెయిడ్ ప్లాన్స్ కాలపరిమితి పెంచండి: ట్రాయ్
దిల్లీ: లాక్డౌన్ సమయంలో వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించాలని టెలికాం ఆపరేటర్లను నియంత్రణ సంస్థ ట్రాయ్ కోరింది. ప్రీపెయిడ్ చందాదారుల ప్రస్తుత పథకాల కాలపరిమితి (వాలిడిటీ)ని పెంచాలని సూచించింది. ప్రాథమ్యాల మేరకు వినియోగదారులకు సేవలందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరింది.
‘లాక్డౌన్ సమయంలో మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రీపెయిడ్ చందాదారులకు అంతరాయం కలగకుండా ప్రస్తుత పథకాల కాలపరిమితిని పెంచడం అందులో ఒకటి’ అని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రీపెయిడ్ సేవల కోసం లాక్డౌన్ సమయంలో రీఛార్జి వోచర్లు, చెల్లింపుల ప్రక్రియ కోసం తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది.
‘టెలికాంను అత్యవసర సేవలుగా గుర్తించి మినహాయింపు ఇచ్చినప్పటికీ వినియోగదారుల సేవా కేంద్రాలపై లాక్డౌన్ ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు వోచర్లు, టాపప్లు దొరకడం కష్టం. అంతరాయం లేకుండా వారు టెలికాం సేవలు పొందేందుకు ప్రస్తుత పథకాల కాలపరిమితి పెంచాలి’ అని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,071కి చేరుకున్న సంగతి తెలిసిందే.