ప్రపంచం యావత్ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో…
ప్రపంచం యావత్ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యవసర సేవలందిస్తూ, ఎంతో సాహసోపేతంగా కరోనాను తరిమికొట్టే విషయంలో ముందు వరుసలో ఉండి కొట్లాడిన వీఆర్‌ఏలు, ఆశవర్కర్లు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సేవలు చరిత్రలో నిలిచిపోతాయని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. వీరి సేవలు వెలకట్టలేనివన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర సేవలందిస్తున్న కింది స్థాయి సిబ్బంది, నిజామాబాద్ సిటీ మీడియా కలిపి 2వేల మందికి రూ. 10లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన కథానాయకులు వీరేనని ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ముందు చూపుతో నష్టం పెద్దగా జరగక ముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తెలంగాణకు ఎంతో ఉపయోగపడిందని, రాష్ట్రంలో పెద్దగా నష్టం జరగలేదని, జరగబోదని అన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని అన్నారు. కరోనాకు మందు లేదని, ఒకరి నుంచి మనకు వ్యాప్తి జరగకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ సూచన మేరకు వచ్చే 7వరకు ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు., మరీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలే బయటకు వెళ్లవద్దని, అదే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. సమాజం మొత్తం క్రమశిక్షణతో మసలుకోవడంతో పెద్దగా నష్టం లేదని, మనం గడ్డకు పడ్డట్టే అన్నారు. కరోనా కనిపించని శత్రువని, ఇది పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలంటే ఇదే స్ఫూర్తి, ఇదే ముందు జాగ్రత్తలు ఇంకొన్ని రోజులు కొనసాగించాలని కోరారు. మనిషికి మనిషి అవసరంపడే సందర్భం వచ్చిందని, సమాజం కష్టాల్లో ఉన్న ఈ సమయంలో జాతి జాతి ఒక్కటై పనిచేసిందని కొనియాడారు. అత్యవసర సేవల్లో వీఆర్‌ఏలు, పోలీసుశాఖ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, అందరి కంటే ఎక్కువగా వంద శాతం తమ బాధ్యతను గుర్తెరిగి పనిచేశారని ప్రశంసించారు. మీరు లేకపోతే కరోనా కట్టడే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి అంశంలో వీరి సేవలు చరిత్రలో రాయబడతాయని కొనియాడారు. ఇదే విధంగా పనిచేసి నిజామాబాద్‌కు మంచి పేరు తీసుకువద్దామని పిలుపునిచ్చారు. అత్యవసర శాఖల సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, తాము టీఆర్‌ఎస్ పార్టీ తరపున రూ. 10లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను రెడ్‌జోన్ పరిధిలోని కంటైన్మెంట్ క్లస్టర్లు, క్వారంటైన్ సెంటర్లు, జిల్లా కేంద్రాస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి అందజేసి వారిని గౌరవించుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూ కిరణ్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.