రాష్ట్ర పతి శ్రీ రామ్ నాద్ కోవింద్ శీతాకాల విడిది…

రాష్ట్ర పతి శ్రీ రామ్ నాద్ కోవింద్ ఈ నెల 21 నుండి 24 వరకు శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రానికి రానున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ మిశ్రా, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, బి.సి. సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, పోలీసు కమీషనర్లు శ్రీ అంజనీ కుమార్ , శ్రీ మహేష్ భగవత్ , జిల్లాల కలెక్టర్లు శ్రీ రఘనందన్ రావు, శ్రీ యం.వి.రెడ్డి, శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రోటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్, పోలీస్ అధికారులు శ్రీ యం.కె.సింగ్, శ్రీ జితేందర్ , కంటోన్మెంట్ , జి.హెచ్ .యం.సి , సమాచార శాఖ, టిఎస్ ఎస్ పిడిసిఎల్ ,ఎయిర్ పోర్టు , మిలిటరి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ ను రూపొందించి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు హకీమ్ పేట విమానాశ్రయంకు చేరుకుంటారని ఈ సందర్బంగా ఎయిర్ పోర్టులో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యటనకు సంబంధించి తగు బందోబస్తు , ట్రాఫిక్ ఏర్పాట్లు , నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మత్తులు, పారిశుద్ధ్యం , స్వాగత తోరణాలు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతి నిలయంలో సి.సి.టివి లు , మెడికల్ టీమ్ లు , టెలీఫోన్ , పత్రికలు, అందుబాటులో ఉంచాలన్నారు.22న కరీంనగర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, 23న రాష్ట్ర పతి నిలయంలో ఎట్ హోం నిర్వహిస్తారని, 24న తిరిగి డిల్లీ కి బయలుదేరి వెళుతారని సి.యస్ తెలిపారు.

About The Author