అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధం…
లేజర్ పుంజంతో విమానం కూల్చివేత
ఆ దేశ నౌకాదళ ప్రయోగం సఫలం
వాషింగ్టన్: గాల్లోనే ఒక విమానాన్ని ధ్వంసం చేసే అత్యంత శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని అమెరికా పరిశోధకులు తయారుచేశారు. దీన్ని విజయవంతంగా ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించినట్లు ఆ దేశ నౌకాదళం ప్రకటించింది. భవిష్యత్ యుద్ధ రీతులకు ఈ ప్రయోగం దర్పణం పడుతోంది. లేజర్ వెపన్స్ సిస్టమ్ డిమోన్‌స్ట్రేటర్ (ఎల్‌డబ్ల్యూఎస్‌డీ)లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
యూఎస్‌ఎస్ పోర్ట్‌లాండ్ అనే యుద్ధనౌక నుంచి ఈ నెల 16న పరీక్షను నిర్వహించినట్లు అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది. గాల్లో ఎగురుతున్న మానవ రహిత విమానాన్ని ఈ లేజర్లు నేలకూల్చాయి. ‘సాలిడ్ స్టేట్ లేజర్’ను ఉపయోగించి ఒక లోహ విహంగాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు తెలిపారు.