తెలంగాణలో ఎయిమ్స్: హెల్త్ హబ్‌గా బీబీనగర్…
బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. రూ.1,028 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఎయిమ్స్‌కు డైరెక్టర్ పోస్టునూ కేంద్రం మంజూరు చేసింది. దీనిని ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద నిర్మిస్తారు. దీనివల్ల బీబీనగర్ ఎయిమ్స్‌కు 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు లభిస్తాయి. 15-20 దాకా సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఇందులో ఏర్పాటవుతాయి. సుమారు 750 పడకలు రోగులకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో రోజూ 1,500 మంది ఔట్‌పేషంట్లు, ప్రతి నెలా 1,000 మంది ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు లభిస్తాయి. అత్యవసర విభాగం/ ట్రామా, ఆయుష్, ప్రైవేటు, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు ఇందులో ఉంటాయి. దీనికితోడు మెడికల్ కాలేజీ, ఆయూష్ బ్లాక్, ఆడిటోరియం, నైట్‌షెల్టర్, అతిథిగృహం, హాస్టళ్లు, గృహసముదాయాలుకూడా ఏర్పాటవుతాయి. 45 నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుంది. తొలి పది నెలల్లో నిర్మాణానికి ముందస్తు సన్నాహాలు (ప్రి కన్స్ట్రక్షన్) జరుగుతాయి. తరువాత 32 నెలల్లో నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది. అనంతరం 3 నెలలపాటూ నిర్మాణ ముగింపు దశ (స్టెబిలైజేషన్) జరుగుతాయి. తెలంగాణ ఎయిమ్స్ కు ఆమోదముద్ర వేసి, నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి జె.పి.నడ్డాకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో తెలంగాణలో నాణ్యమైన వైద్య సౌకర్యాలు, వైద్యవిద్య అందుబాటులోకి వస్తాయని తెలిపారు.