రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు మరోసారి రంగంలోకి
న్యూఢిల్లీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రులతో సమావేశానికి ముందుగా కేంద్ర సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో సమావేశం అనంతరం ప్రధాని మరో దఫా అత్యంత కీలకమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
వర్షాకాలం నేపథ్యంలో కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నందున రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించి, చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ప్రధాని ఆదేశించారు.దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న రీత్యా రాబోయే రెండు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం, కేంద్ర, రాష్ట్ర, మునిసిపాలిటీ అధికారులతో తక్షణం సమావేశమై సమగ్రమైన, సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌తో పాటు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, సాధికారిక బృందాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.దేశంలో ప్రస్తుత పరిస్థితి, సమీప భవిష్యత్తులో కరోనా స్థితిగతులపై వైద్య అత్యవసర నిర్వహణకు చెందిన సాధికారిక బృందం కన్వీనర్, నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ వివరించారు. పెద్ద నగరాల్లో పరీక్షా సదుపాయాలు, పడకలు, సేవలను పెంచి సమర్థంగా కరోనాను ఎదుర్కోక తప్పదని ఆయన సూచించినట్లు సమాచారం. నగరాలు, జిల్లా స్థాయి నుంచి ఆస్పత్రులు, పడకలకు సంబంధించిన సౌకర్యాలపై సాధికారిక బృందం చేసిన సిపారసులను ప్రధాని పరిశీలించినట్లు తెలిసింది. కొవిడ్ నియంత్రణలో అనేక రాష్ట్రాలు సమర్థంగా చ ర్యలు తీసుకున్నాయని మోదీ ప్రశంసించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని, మూడింట రెండొంతుల కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ప్రధానికి అధికారులు వివరించారు.