మూత్రంలో రక్తం కనపడితే జాగ్రత్తగా ఉండాల్సిందే…
మూత్రంలో రక్తం కనపడితే జాగ్రత్తగా ఉండాల్సిందే…
‘మూత్రం ఎర్రగా కనబడుతోంది. రక్తం పడుతోంది’ అని కొందరు వాపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. మూత్రంలో రక్తం పడినప్పుడు ముందుగా ఆలోచించాల్సింది నొప్పి గురించి. నొప్పితో పాటు మూత్రం వస్తుంటే ఇన్‌ఫెక్షనో, మూత్రాశయంలో రాళ్ల వంటివో కారణం కావొచ్చు. ఇదేమంత ప్రమాదకరం కాదు. ఆయా సమస్యలకు చికిత్స తీసుకుంటే నయమైపోతుంది. కానీ నొప్పిలేకుండా మూత్రం ఎర్రగా వస్తుంటే మూత్రశయంలో, కిడ్నీలో, మూత్రమార్గంలో ఎక్కడైనా కణితి ఉందేమోనని పరిశీలించటం తప్పనిసరి. కేవలం ఇన్‌ఫెక్షన్‌గా భావించి మందులు వాడుకోవటం సరికాదు. ఇన్‌ఫెక్షన్ బాగా తీవ్రమై, మూత్రం బాగా మంటగా వస్తున్నప్పుడు రెండు, మూడు చుక్కలు రక్తం పడితే పడొచ్చు గానీ మూత్రం మొత్తం ఎర్రగా రావటం అరుదు. అందువల్ల నొప్పిలేకుండా మూత్రంలో రక్తం పడుతుంటే నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి మూత్రంలో రక్తం పడినా తగు పరీక్షలు చేసి కారణమేంటన్నది గుర్తించాలి. కణితుల వంటివి ఉన్నాయేమో నిర్ధరించుకోవాలి. సాధారణంగా కిడ్నీలో, మూత్రాశయంలో కణితులు ఏర్పడుతుంటాయి. కణితి నుంచి చిన్నముక్క తీసి పరీక్షిస్తే ఏ దశలో ఉందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా చికిత్స చేస్తారు. కిడ్నీలో కణితి చిన్నగా ఉంటే అంతమేరకు తొలగిస్తే సరిపోతుంది. మరీ పెద్దగా ఉంటే కిడ్నీ మొత్తం తీసేయాల్సి వస్తుంది.
మూత్రంలో రక్తం కనబడినప్పుడు చాలామంది యాంటీబయోటిక్ మందులు వేసుకుంటారు. అప్పటికది తగ్గిపోవచ్చు కూడా. నిజానికి యాంటీబయోటిక్స్ తీసుకోకపోయినా రక్తం పడటం తగ్గుతుంది. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ మొదలవుతుంది.