చికెన్ వింగ్స్ లో కరోనా.. జాగ్రత్త…


చైనాలోని జియాన్‌, షెన్‌జెన్‌ నగరాల్లో కరోనా వైరస్‌ మరోసారి కలకలం రేపింది. ఈక్వెడార్‌ నుంచి దిగుమతైన రొయ్యలు, అలాగే, బ్రెజిల్‌ నుంచి వచ్చిన చికెన్‌ వింగ్స్‌ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్టు తేలడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న నిల్వ ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించాయి. చైనాలోని షాంజీ ప్రావెన్స్‌లోని జియాన్‌ నగరానికి ఇటీవల ఈక్వెడార్‌ నుంచి రొయ్యలు దిగుమతయ్యాయి. అయితే, కరోనా నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను పరీక్షిస్తుండగా కొన్ని రొయ్యల పార్శిల్స్‌లో వ్యాధికారక వైరస్‌ ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా ఉత్పత్తులు, వాటితో ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలిందని తెలిపారు.
అలాగే, గ్వాంగ్డాంగ్‌ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌ నగరానికి బ్రెజిల్‌ నుంచి దిగుమతైన చికెన్‌ వింగ్స్‌లోనూ కరోనా వైరస్‌ ఉండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కలుషితాహారంతో మళ్లీ వైరస్‌ ఎక్కడ విజృంభిస్తోందోనని ఆందోళనగా ఉందని అధికారులు తెలిపారు. చికెన్‌ వింగ్స్‌ ఉపరితలం నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించగా కరోనా ఉన్నట్టు గుర్తించినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంటోస్‌ ప్లాంట్‌ నుంచి ఈ మాంసం షెన్‌జెన్‌కు వచ్చినట్టు వివరించారు. మరోవైపు, దీంతో దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

About The Author