AP లో మరో స్టీల్ ప్లాంట్…
స్టీల్ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్) కొత్తగా స్టీల్ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి కెపాసిటీతో ఇది రెడీ అవుతోంది. రూ.1,200 కోట్ల పెట్టుబడిని దీనికి వెచ్చించనున్నారు. ఫలితంగా దాదాపు 18 వందల మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
2021 ద్వితీయార్థం నాటికి ప్లాంటు రెడీ అవుతోందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షికోత్పత్తి కెపాసిటీ 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి కెపాసిటీ క్రమంగా 2021నాటికి 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.
గ్రూప్ టర్నోవర్ రూ.2వేల 100 కోట్లు.
కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన..
ఎమ్మెస్‌ఏఎఫ్ కొత్తగా ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తామే దీనిని సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, దేశంలో తొలిసారి ఇటువంటి ఉత్పాదన జరిగిందని కంపెనీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద వీటి తయారీ జరుగుతుంది.
ఎంఎస్ లైఫ్ 600, ఏఎఫ్ స్టార్ 500-డి పేరుతో స్టీల్ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్ పార్ట్‌నర్స్ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు స్టీల్‌ను సరఫరా చేసింది.