పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తి… నరేంద్ర మోదీ వ్యాఖ్యలివి!:
అది నవంబర్ 8, 2016… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతిని ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా, ఇండియాలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, భారతావనిని ఆశ్చర్యపరిచారు. ప్రధాని ప్రకటన తరువాత, తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. కొత్త నోట్లను ఏటీఎంల నుంచి తీసుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.
నోట్ల రద్దు జరిగి, నాలుగేళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. “నోట్ల రద్దు ఇండియాలో నల్లధనాన్ని తగ్గించింది. పన్ను వసూళ్లను పెంచి, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచింది. దేశం ముందడుగు వేయడానికి సహకరించింది. నోట్ల రద్దు ఫలితాలు చూడండి” అని కొన్ని గ్రాఫ్ లను పోస్ట్ చేశారు.
కాగా, నోట్ల రద్దు జరిగిన 2016 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 9.25 శాతం నుంచి 5.02 శాతానికి పడిపోయింది. తొలి దశలో నోట్ల రద్దు భారత్ కు ఉపకరించిందని, ఉగ్రవాదులకు నిధులు రాకుండా చేసిందని వార్తలు వచ్చినా, ఆపై ఇదో అతిపెద్ద తప్పని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని ఎంతో మంది అభిప్రాయపడ్డారు.