తుంగభద్ర పుష్కరాల్లో పుణ్య స్నానాలకు అనుమతి…


*మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం*

అలంపూర్‌: కొవిడ్‌ నిబంధనల మేరకు తుంగభద్ర పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. తద్వారా నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు నిర్వహించనున్న పుష్కరాల్లో పుణ్యస్నానాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. విడతల వారీగా భక్తులను నదుల్లోకి అనుమతిస్తామని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ ఆ క్రతువును ఆచరించాలని సూచించింది. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇవీ పాటించాల్సినవి…
* పది సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణులు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పుష్కరస్నానం చేసేందుకు రాకపోవడం మంచిది.
* భక్తులు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే రావాలి. ఘాట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఉష్ణోగత్ర ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణయితే అలాంటి వారిని పుణ్యస్నానాలకు అనుమతించరు.
* భక్తులను ఒకేసారి కాకుండా విడతల వారీగా నదిలోకి అనుమతిస్తారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ పుణ్యస్నానాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అనుసరిస్తూ పిండ ప్రదానాలూ చేసుకోవచ్చు.
* ఆలయాల్లోనూ భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలి.
* ఘాట్‌ వద్ద త్వరగా పూజలు ముగించుకోవాలి. నదిలో ఎలాంటి పూజా పదార్థాలు వేయకూడదు.
* ప్లాస్టిక్‌ సంచులు వినియోగించరాదు.

About The Author