రాష్ట్రంలో మొట్టమొదటి విద్యుత్‌ లైన్‌ఉమెన్స్‌గా ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు.


పోరాడి సాధించారు
రాష్ట్రంలో మొట్టమొదటి విద్యుత్‌ లైన్‌ఉమెన్స్‌గా ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు.
విద్యుత్‌ శాఖ నిర్వహించిన అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల్లో లైన్‌మన్‌ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష, వరంగల్‌ జిల్లాకు చెందిన భారతి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి ఆదిలోనే వివక్ష ఎదురైంది. లైన్‌మన్‌ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకున్న వారికి అధికారులు, విద్యుత్‌ సంస్థల రూపంలో అడ్డుకట్ట పడింది. అయినా వెనుదిరగకుండా ఇద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి ఉద్యోగ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
కోర్టు సూచనతో దిగి వచ్చిన అధికారులు మొదట రాత పరీక్ష నిర్వహించారు. ఏమైందో ఏమో కానీ పరీక్ష ఫలితాల విడుదలను అధికారులు నిలిపేశారు. ఈ విషయమై మళ్లీ కోర్టు మెట్లు ఎక్కడంతో రాత పరీక్ష ఫలితాలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. దీంతో విద్యుత్‌ సంస్థలు చేసేదేమి లేక పరీక్ష ఫలితాలు విడుదల చేయడంతో అందులోనూ శిరీష, భారతి ఉత్తీర్ణత సాధించారు. కోర్టు ఆదేశాలతో రెండోదశ పరీక్షలో భాగంగా పోల్‌ టెస్ట్‌ను నిర్వహించగా ఇద్దరూ పాస్‌ అయ్యారు. చివరికి విద్యుత్‌ శాఖలో ఉద్యోగం సాధించారు. కాగా తుది ఫలితాలకు సంబంధించిన వివరాలను కోర్టుకు అప్పగించాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు వారికి పోస్టింగ్‌ను ఇవ్వనున్నారు.

About The Author