గుడ్ న్యూస్ పెట్రోల్, డీజిల్‌పై అదనపు భారం లేనట్లే


లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.5, లీటర్‌ డీజిల్‌పై రూ.4 చొప్పున అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌(ఏఐడీసీ) విధిస్తున్నట్లు 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి, నిత్యావసరాల ధరలు మండిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ వాస్తవానికి ప్రజలపై ఈ భారం ఉండదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్‌పై బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ(బీఈడీ), స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని ప్రభుత్వం తగ్గించింది.ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై బీఈడీ రూ.2.98 ఉండగా, దీన్ని రూ.1.4కు తగ్గించారు. అలాగే ఎస్‌ఏఈడీని రూ.12 నుంచి రూ.11కు కుదించారు. అలాగే లీడర్‌ డీజిల్‌పై బీఈడీని రూ.4.83 నుంచి రూ.1.8కు, ఎస్‌ఏఈడీని రూ.9 నుంచి రూ.8కి తగ్గించివేశారు. మొత్తంగా ఎక్సైజ్‌ పన్ను (బీఈడీ+ఎస్‌ఏఈడీ+ఏఐడీసీ) లీటర్‌ పెట్రోల్‌పై రూ.14.9, లీటర్‌ డీజిల్‌పై రూ.13.8 కానుంది. ఇప్పటివరకు ఇది వరుసగా రూ.14.98, రూ.13.83గా ఉంది. అంటే కొత్తగా అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ విధించినా పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పు ఉండదు. వినియోగదారులపై అదనపు భారం పడబోదు.

మద్యం ధరల్లోనూ మార్పు లేదు

పెట్రోల్‌ డీజిల్‌ తరహాలోనే ఇంపోర్టెడ్‌ మద్యంపై 100 శాతం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌(ఏఐడీసీ) విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ప్రకటించింది. 80 కంటే తక్కువ ఆల్కహాల్‌ శాతం ఉన్న దిగుమతి చేసుకున్న స్పిరిట్స్, వైన్స్‌పై ప్రస్తుతం 150 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తున్నారు. దీన్ని రూ.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మద్యంపై కస్టమ్స్‌ డ్యూటీ, ఏఐడీసీ కలిపి 150 శాతం కానుంది. అంటే దిగుమతి చేసుకున్న మద్యంపై ఏఐడీసీ విధించినప్పటికీ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.

About The Author