వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు..
రేషన్ షాపుల ముందు క్యూలు కట్టి పడిగాపులు పడే విధానానికి స్వస్తి చెబుతూ.. ఇంటి వద్దకే రేషన్ సరకుల్ని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం రేషన్ ట్రక్కుల్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో సక్సెస్ అయిన ఈ విధానాన్ని.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చూసినా, పంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో.. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కొత్త విధానం అమలవుతోంది. అయితే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనిపిస్తుందా లేదా అనేదే ప్రశ్నార్థకం.
ఇన్నాళ్లూ రేషన్ షాపుల ముందు కనపడ్డ క్యూ లైన్లు.. ఇప్పుడు ట్రక్కుల ముందు కనపడుతున్నాయి. పైగా 12 రోజులవుతున్నా సగం పని కూడా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం పరిష్కార మార్గాలు వెదుకుతోంది. ముందుగా డ్రైవర్ల అసంతృప్తిని తీర్చేందుకు వారి జీతాన్ని ఏకంగా రూ.5వేలు పెంచింది. నెలకు రూ.21వేలు ఫిక్స్ చేసింది. సహాయకుడిని ఇవ్వండి అని అడిగితే.. అంతకు మించి ఆర్థిక సాయం అందించింది.
లబ్ధిదారుల అత్యుత్సాహంతోనే క్యూలైన్లు..
రేషన్ ట్రక్ వీధిలోకి వచ్చిందనే సమాచారం తెలియగానే లబ్ధిదారులంతా ట్రక్ చుట్టూ గుమికూడుతున్నారు. ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ ఇస్తారని చెబుతున్నా కూడా వారు వెళ్లడంలేదని వాపోతున్నారు వాలంటీర్లు. లబ్ధిదారుల్ని అక్కడినుంచి పంపించలేక, క్యూలైన్లను తగ్గించలేక అవస్థలు పడుతున్నారు.
తొలి విడత కావడంతో.. లబ్ధిదారుల్లో కూడా అనుమానాలున్నాయి. తమ ఇంటి దగ్గరకు రేషన్ ట్రక్ రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ ట్రక్ వచ్చినప్పుడు తాము ఇంటివద్ద లేకపోతే ఎలా చేస్తారనే విషయంపై వారికి క్లారిటీ లేదు. దీంతో అందరూ ఒకేసారి గుమికూడుతున్నారు.
షాపులు ఎక్కువ, వాహనాలు తక్కువ..
ప్రస్తుతం రాష్ట్రంలో 29,783 రేషన్ షాపులున్నాయి. రాష్ట్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ట్రక్కుల సంఖ్య 9260. సగటున ఒక్కో వాహనానికి 1500 కార్డులు కేటాయిస్తారు, అంటే రెండు లేదా మూడు షాపులకి ఒక్కో వాహనాన్ని కేటాయిస్తారనమాట.
ఇలా కేటాయించడం వల్ల అనుకున్న సమయానికి రేషన్ పంపిణీ పూర్తి కావడంలేదు. నెలలో సగం రోజులు పూర్తవుతున్నా.. ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు.
పల్లెల్లో పరిస్థితి ఏంటి..?
వాహనాల విషయంలో ఎన్నికల కమిషన్ కి, ప్రభుత్వానికి మధ్య పంచాయితీ నడుస్తుండటంతో పల్లెల్లో ఇంకా రేషన్ పంపిణీ మొదలు కాలేదు.
ఈ-పోస్ మిషన్లలో డీలర్ల వేలిముద్రతో పాటు, ఎండీయూ ఆపరేటర్ (ట్రక్ డ్రైవర్) వేలిముద్ర కూడా పడితేనే రేషన్ పంపిణీ చేసే పద్ధతి మొదలౌతుంది. దీనిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
దిద్దుబాటు చర్యలు..
ఇంటి వద్దకే సరుకులు చేరవేయాలనే ప్రభుత్వ ఉద్దేశం.. తొలి నెలలో పూర్తి స్థాయిలో నెరవేరలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వీధిలో నిలబెట్టే అందరికీ సరుకులు ఇస్తున్నారు ట్రక్ డ్రైవర్లు. దీంతో ఉన్నతాధికారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదని చెబుతున్నారు. వీధుల్లో క్యూ లైన్లు కనపడటానికి వీలు లేదని, ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరకులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు.
పట్టణాల్లో ఎదురవుతున్న బాలారిష్టాలను దాటుకుంటేనే.. రేపు పల్లెటూళ్లలో రేషన్ పంపిణీ సజావుగా సాగే అవకాశం ఉంది. లేదంటే పల్లెల్లో ఇంకా పెద్ద క్యూలు కనిపిస్తాయి. అప్పుడది మొత్తంగా ఈ ‘డోర్ డెలివరీ’ అనే ప్రయత్నానికే విఘాతంగా మారుతుంది.