ఏకదండి … ద్విదండి … త్రిదండి


సన్యాశ్రమం పుచ్చుకున్నవారు … చేతిలో కఱ్ఱలు ధరించి ఉంటారు .
వాటి అర్ధం ఏమిటి ? వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.
********
వైరాగ్యానికి … తాత్వికతకి ప్రతీకలు ఆ కఱ్ఱలు. అంతే గాదు వారు ( సన్యాశ్రమం పుచ్చుకున్నవారు ) నమ్మి … ఆచరించే సిద్ధాంతం / తత్వం / మార్గం / ఆలోచన కనుగుణంగా ఉంటాయి కఱ్ఱలు . ఆ కర్రలు కొన్ని సన్నగానూ కొన్ని లావుగానూ ఉంటాయి . ఆ కఱ్ఱల్ని ” దండములు ” అని అంటారు . అవి ఐదడుగులు ఎత్తు ఉంటాయి . మనిషి పంచభూతముల సమ్మేళనం . అందుకు ప్రతీకగా వారు అయిదు అడుగుల ఎత్తు ఉన్న దండాలను పట్టుకుని ఉంటారు .

రావి చెట్టు జ్ఞానానికి సంకేతం … అందుకని రావి చెట్టు నుంచీ సేకరించిన కఱ్ఱలను దండాలుగా ఉపయోగిస్తారు. ” ఏకదండి ” అంటే ఒకే ఒక దండాన్ని ధరించువారు .
వీరు నమ్మి … ఆచరించే సిద్ధాంతం ” అద్వైతము లేక స్మార్థము ” జగద్గురువులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రతిపాదించిన సిద్ధాంతం .ఈ సిద్ధాంతం ప్రకారం జీవాత్మ … పరమాత్మ ఒక్కటే . వేరు వేరు కాదు. కేరళ రాష్ట్రంలో … పూర్ణానది ఒడ్డున గల ” కాలడి ” అనే చిన్న గ్రామం శంకరుల జన్మస్థలం .

********

రెండు కఱ్ఱల్ని ఒక్కటిగా కట్టి ధరించువారిని ” ద్విదండి ” స్వాములు అంటారు. వీరు నమ్మి … ఆచరించు తత్వాన్ని / సిద్ధాంతాన్ని ” ద్వైతము లేక మధ్వము ” అంటారు .ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు శ్రీ మధ్వాచార్యులు . వీరి సిద్ధాంతం ప్రకారం జీవాత్మ వేరు … పరమాత్మ వేరు .” మధ్వాచార్యులు ” సన్యాసాశ్రమ పేరు . జన్మనామము శ్రీ వాసుదేవ. జన్మస్థలం కర్ణాటక రాష్ట్రంలోని ” ఉడిపి ” .

********
మూడు కఱ్ఱల్ని ఒక్కటిగా కట్టి ధరించువారిని ” త్రిదండి ” స్వాములు అంటారు. వీరు నమ్మి … ఆచరించు తత్వాన్ని / సిద్ధాంతాన్ని ” విశిష్టాద్వైతము లేక వైష్ణవము ” ఈ తత్వాన్ని / సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు శ్రీ రామానుజాచార్యులు. శరీరంలో జీవాత్మ , జీవాత్మలో పరమాత్మ … జీవాత్మ , పరమాత్మ ప్రకృతి సత్యాలు … ఈ మూడు నారాయణ తత్వమని వీరి నమ్మకం / సిద్ధాంతం. శ్రీ రామానుజాచార్యులు జన్మస్థలం తమిళనాడు రాష్ట్రం … చెన్నపట్నం దగ్గరున్న ” భూతపురము ” ( శ్రీపెరంబుదూరు )
జన్మనామం ” ఇళయ పెరుమాళ్ “.

About The Author