ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఒకటి ఇటీవలి కాలంలో దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏర్పాటు కానున్న కాగిత పరిశ్రమ. రూ.24,500 కోట్ల పెట్టుబడితో ఆసియా పేపర్‌, పల్ప్‌ (ఏపీపీ) కాగిత పరిశ్రమను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పర అంగీకార పత్రాలు (ఎంవోయూ) మార్చుకున్నారు.
రెండో కీలకమైన ప్రాజెక్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకోనున్న రామాయపట్నం పోర్టు. ఈ రెండింటికి బుధవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. పైలాన్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు మాట్లాడుతూ…

”రూ.4200 కోట్ల అంచనాలతో పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. పోర్టు పక్కనే మత్య్సకారుల కోసం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తాం. ఒకే ప్రాంతంలో పోర్టు, హార్బర్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు, కాగిత పరిశ్రమలతో పాటు సమీపంలోనే అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాంతంలోని కనీసం 10 వేల కుటుంబాలకు భరోసా లభిస్తుంది. అమరావతి తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందేది ఒంగోలు నగరమే.” అని అన్నారు. అనంతరం జన్మభూమి- మావూరు సభలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, పిల్లల ఆటల పోటీలనూ సీఎం సందర్శించారు.

About The Author