బంగారం కొండ దిగుతోంది..!


కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్‌ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్‌) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్‌లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌కాగా.. స్పాట్‌ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం!
దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి…
కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్‌ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్‌చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్‌–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు.
గరిష్టం నుంచి రూ. 10,000 పతనం
గత ఆగస్ట్‌లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్‌లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్‌ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్‌ 7న ఔన్స్‌ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్‌ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్‌వుడ్‌ కేన్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక సీఈవో నిష్‌ భట్‌ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్‌ పుంజుకుంటే పసిడిని హోల్డ్‌ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు.

ఆర్థిక రికవరీ సంకేతాలు…
ట్రెజరీ ఈల్డ్స్‌ బలపడటం అంటే యూఎస్‌ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్‌ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్‌మెంట్‌ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ నిపుణులు క్షితిజి పురోహిత్‌ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్‌ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్‌ షార్ట్‌సెల్లింగ్‌ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది.

ఇవీ కారణాలు..
► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్‌ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు.

► యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్‌– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు.

► ఇటీవల కోవిడ్‌–19 కట్టడికి గ్లోబల్‌ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు.

► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్‌ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు.

About The Author