తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కేసులు


రాష్ట్రంలో శుక్రవారం 157 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,97,435కు పెరిగింది. వైర్‌సతో కొత్తగా ఎవరూ చనిపోలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 157 మంది డిశ్చార్జితో రికవరీ లు 2,94,097కు చేరాయి. 1,715 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 27, మేడ్చల్‌లో 15, రంగారెడ్డి జిల్లాలో 12 నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కరోనా బారినడ్డాడు. శుక్రవారం విదార్థి తల్లికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడికి పరీక్ష చేయించగా కరోనా నిర్ధారణ అయింది. అతడి చుట్టుపక్కలకూర్చునే ఆరుగురితో పాటు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి పాఠశాలను మూసివేశారు. కాగా, కరోనాతో చికిత్స పొందుతూ యాలకుంట మల్లయ్య (77) అనే జీవిత ఖైదీ వరంగల్‌ ఎంజీఎంలో శనివారం మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం గోలిపల్లికి చెందిన మల్లయ్య ఓ హత్య కేసులో నిందితుడు.
22 నుంచి ప్రైవేటు వైద్య సిబ్బందికి రెండో డోసు
రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందికి టీకా రెండో డోసు ఇవ్వనున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మరో 1,108 మంది వైద్య సిబ్బంది రెండో డోసు వేయించుకున్నారు. 3,892 మందికి లక్ష్యంగా పెట్టుకోగా 28.3 శాతం మంది మాత్రమే ముందుకొచ్చారు. వీరితో కలిపి రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 92,632కు పెరిగింది. కాగా, వైద్య సిబ్బందిలో మొత్తం 1,93,486 మంది తొలి డోసు వేయించుకున్నారు. శనివారం నాటి 696 మందితో కలిపి ఇప్పటివరకు 87,693 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేశారు. మిగిలిపోయినవారికి సోమవారం మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు.

About The Author