సర్దార్ పటేల్ పేరు తీసేసి..మోడీ పేరు!
గుజరాత్ లో భారీ ఎత్తున నిర్మించిన మొతేరా కొత్త స్టేడియం పేరును మార్చేశారు. ఈ రోజే చాలా గ్రాండ్ గా మొదలైన ఆ స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు పెట్టారు. ప్రారంభోత్సవ సమయానికి మొతేరా స్టేడియం- సర్దార్ పటేల్ స్టేడియంగా పేరున్న ఆ మైదానాన్ని అర్జెంటుగా నరేంద్రమోడీ స్టేడియంగా మార్చేశారు.
ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు ప్రారంభమై కొనసాగుతున్న డే అండ్ నైట్ టెస్టు సందర్భంగా ఈ మైదానాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ మైదానాన్ని ప్రారంభించారు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగానే పాత పేరును తీసేసి కొత్త పేరు పెట్టడం, అది కూడా ప్రధాని పేరే పెట్టేయడం గమనార్హం!
ప్రత్యేకించి బీజేపీ బాగా ఉపయోగిస్తున్న సర్దార్ పటేల్ పేరును తొలగించి నరేంద్రమోడీ పేరును పెట్టేయడం అసలు విషయం. ఇందులో రాజకీయ చర్చ సహజంగానే వస్తోంది. ఇన్నాళ్లూ పేర్ల విషయంలో కూడా బీజేపీ చాలా విమర్శించింది.
ప్రత్యేకించి నెహ్రూ-ఇందిర- రాజీవ్ ల పేర్లతో దేశంలో లెక్కలేనన్ని నిర్మాణాలు, పథకాలు ఉన్నాయంటూ విమర్శలు చేసే వాళ్లు బీజేపీ వాళ్లు. ఆ సమయంలో వీళ్లు చేసిన మరో విమర్శ సర్దార్ పటేల్ లాంటి వారికి తగిన గుర్తింపును రానీయలేదని, వారిని జాతి జ్ఞాపకాల నుంచి చెరిపేసే ప్రయత్నం జరిగిందని కూడా కమలం పార్టీ వాళ్లు విమర్శించారు.
ఆ తరహా రాజకీయ ప్రసంగాలు గత కొన్నేళ్లలో ఎన్నో చేశారు. అయితే తీరా.. ఇప్పుడు పటేల్ పేరు తీసేసి మోడీ పేరు పెట్టేసుకోవడం సిసలైన విషయం. పటేల్ పేరిట కాంగ్రెస్ ఎలాంటి జ్ఞాపకాలనూ ఉంచలేదంటూ నిత్యం విమర్శిస్తూ, పటేల్ కు గుర్తింపు ఇచ్చిందే తాము అయినట్టుగా వ్యవహరించే రాజకీయ ప్రంసగాలు చేస్తూ ఉంటారు కమలనాథులు. తీరా.. ఇప్పుడు సర్దార్ పటేల్ పేరిట ఉన్న స్టేడియంను మోడీ పేరుకు బదలాయించడం గమనార్హం.