యశ్వంత్చౌదరికి మద్దతుగా వచ్చిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు
చంద్రగిరి గ్రామీణ: చంద్రగిరి మండల తెలుగుదేశం పార్టీ యువనేత యశ్వంత్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఎం.కొంగరవారిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద గొడవ చేసి కారును ధ్వంసం చేసినట్లు శ్రీనివాసులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఆరుగురు తెదేపా నేతలపై గత నెల 23న సీఐ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేశారు. కేసులో తదుపరి విచారణకు సహకరించాలని కోరుతూ గత నెల 28న యశ్వంత్ చౌదరి, దొమ్మలపాటి సతీష్, హరినాయుడు, వేణు, దిలీప్, మునిశేఖర్లకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
యశ్వంత్ చౌదరిని మంగళవారం తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరు పరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం బెయిల్ పిటిషన్ సమర్పించటంతో జరిగిన వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ అతనికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. ఎం.కొంగరవారిపల్లి పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించటం అమానుషమని టీఎన్ఎస్ఎఫ్ నేత రవినాయుడు విమర్శించారు.